Harmanpreet Kaur: బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా రెండ్రోజుల క్రితం ఆ జట్టుతో ముగిసిన మూడో వన్డే మ్యాచ్‌లో తన దురుసు ప్రవర్తనతో టీమిండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కష్టాలు తప్పేలా లేవు. అంపైరింగ్ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టడం.. అంపైర్‌ను వాగ్వాదానికి దిగడమే గాక సంజ్ఞల ద్వారా ఆయనను దూషించడం.. మ్యాచ్ ముగిశాక ప్రజెంటేషన్ సెర్మనీలో అంపైర్లపై చేసిన వ్యాఖ్యలు, ట్రోఫీ అందుకునేప్పుడు బంగ్లా ఆటగాళ్లపై వ్యవహరించిన తీరు వివాదాస్పదమవుతోంది. దీనిపై ఇప్పటికే ఐసీసీ.. కౌర్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నిషేధం కూడా ఎదుర్కోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
డీ మెరిట్ పాయింట్స్‌తోనే అసలు సమస్య..
హర్మన్‌ప్రీత్ తీరుకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆమె మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు 4 డీమెరిట్ పాయింట్స్ కూడా ఇచ్చింది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. నాలుగు డీమెరిట్ పాయింట్స్ అంటే రెండు సస్పెన్షన్ పాయింట్స్. అంటే దీనర్థం.. ఒక టెస్టు లేదా రెండు టీ20లు గానీ రెండు వన్డేలలో గానీ నిషేధం ఉంటుంది. దీని ప్రకారం.. హర్మన్‌ప్రీత్ తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్‌లు (వైట్ బాల్ క్రికెట్‌లో అయితే) నిషేధం ఎదుర్కోక తప్పదు. భారత జట్టు తర్వాత షెడ్యూల్ సెప్టెంబర్‌లో చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలే..
బ్యాన్ ఉంటుందా..?
పైన పేర్కొన్న నిబంధనల మేరకు హర్మన్‌ప్రీత్‌కు నిషేధం ఎదురైతే ఆమె ఆసియా క్రీడల్లో భారత్ ఆడబోయే తొలి రెండు మ్యాచ్‌లలో దూరమవుతుందా..? దీనికి సమాధానం కాదనే చెప్పాలి. ఎందుకంటే ఆసియా క్రీడల్లో ఆడే మ్యాచ్‌లు ఐసీసీ పరిధిలోకి రావు. ఇది హర్మన్‌ప్రీత్‌కు లాభించేదే. కానీ ఆసియా క్రీడల తర్వాత ఆమె ఆడబోయే భారత జట్టు మ్యాచ్‌లలో టీమిండియా సారథిపై నిషేధం తప్పకపోవచ్చు. అయితే ఇందులో ఐసీసీ ఇంకా అధికారికంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
ఇండియన్ క్రికెట్ పరువు పోయింది..
హర్మన్‌ప్రీత్ తీరుపై భారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ మెంబర్ మదన్ లాల్ స్పందించాడు. ఆమె భారత క్రికెట్‌కు మచ్చ తెచ్చిందని, ఆట కంటే ఆమె గొప్పదేం కాదని ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టుపై హర్మన్‌ప్రీత్ వ్యవహరించిన తీరు చాలా విషాధకరం. ఆమె ఆట కంటే గొప్ప వ్యక్తేం కాదు. భారత క్రికెట్ పరువు తీసే విధంగా ఆమె వ్యవహరించింది. ఈ విషయంలో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకోవాలి’ అని ట్విటర్ వేదికగా రాసుకొచ్చాడు.