Ashes 2023: యాషెస్ సిరీస్ - 2023ను ఆస్ట్రేలియా నిలబెట్టుకుంది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో ఆదివారం ముగిసిన నాలుగో టెస్టు వర్షం కారణంగా రద్దు కావడంతో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌ను దక్కించుకుంది. ఆట ఐదో రోజు మొత్తం వర్షార్పణం కావడంతో ఇంగ్లాండ్ విజయావకాశాలపై నీళ్లు కుమ్మరించినట్టైంది. మాంచెస్టర్ టెస్టులో విజయానికి ఐదు వికెట్ల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్‌కు వరుసగా రెండు రోజుల పాటు చికాకు పెట్టిన వర్షం.. తీవ్ర నిరాశను మిగిల్చింది.
మాంచెస్టర్ టెస్టులో ఆది నుంచీ ఇంగ్లాండ్ ఆధిక్యం చూపించింది. తొలుత ఆస్ట్రేలియాను 317 పరుగులకే ఆలౌట్ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 592 పరుగులు సాధించి ప్రత్యర్థికి కఠిన సవాల్ విసిరింది. ఆస్ట్రేలియాపై 275 పరుగుల ఆధిక్యాన్ని సాధించడమే గాక ఆటలో మూడో రోజే ఆసీస్‌ను 114-4తో నిలువరించింది. ఇక నాలుగో రోజు 30 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యమైంది. ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ సెంచరీతో ఆసీస్ పోరాటానికి దిగినా ఆ జట్టు ఇంకా 61 పరుగులు వెనుకబడే ఉంది. మ్యాచ్ జరిగిఉంటే ఏమయ్యేదో గానీ పరిస్థితులు మాత్రం ఇంగ్లాండ్ గెలుపునకే ఎక్కువ అవకాశాలున్నాయి. కానీ ఆట చివరిరోజు ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా మ్యాచ్ పేలవమైన డ్రా గా ముగిసింది.
యాషెస్ ఆసీస్‌కే..
నాలుగు టెస్టులు ముగిసిన ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులు గెలిచిన ఆస్ట్రేలియాకే యాషెస్ దక్కనుంది. ఈ సిరీస్ లో కంగారూలు 2-1 ఆధిక్యంలో ఉన్నారు. చివరి టెస్టు జులై 27 నుంచి కెన్నింగ్టన్ ఓవల్ (లండన్)లో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా ఆస్ట్రేలియాకు పోయేదేమీ లేదు. ఇంగ్లాండ్ గెలిచి సిరీస్‌ను సమం చేసినా యాషెస్ ట్రోఫీని ఆస్ట్రేలియానే నిలబెట్టుకోనుంది. ఎందుకంటే గత యాషెస్ (2021-22 సీజన్)లో ఆస్ట్రేలియా స్వదేశంలో ఇంగ్లాండ్‌ను 4-0తో ఓడించిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఒక సిరీస్ సమమైతే గత విజేతకే యాషెస్ సొంతమవుతుంది. 2017-18 లో కూడా ఆస్ట్రేలియా ఇలాగే యాషెస్‌ను నిలబెట్టుకుంది.
కాగా ఓవల్‌లో ఆస్ట్రేలియా గనక ఇంగ్లాండ్‌ను ఓడిస్తే అది చరిత్రే కానుంది. 2001 తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్.. యాషెస్ సిరీస్‌ను కోల్పోలేదు. ఓవల్‌లో గెలిస్తే మాత్రం 22 ఏండ్ల తర్వాత పాట్ కమిన్స్ సేన చరిత్ర సృష్టించడం ఖాయం.. ఇంగ్లాండ్ చివరిసారి 2015-16లో యాషెస్‌ను గెలుచుకుంది. ఆ ఏడాది స్వదేశంలో జరిగిన సిరీస్‌లో ఇంగ్లాండ్ 3-2తో యాషెస్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 8 ఏండ్లు గడుస్తున్నా యాషెస్ ట్రోఫీ ఇంగ్లాండ్‌కు అందని ద్రాక్షే అవుతోంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial