Pakistan knocked out of T20 World Cup 2024: హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ చంపేసినట్లు అయిపోయింది పాకిస్థాన్ పరిస్థితి. ఒక మ్యాచ్ ఒకే ఒక్క మ్యాచ్ యూఎస్ఏ మీద ఓడిపోయిన పాపానికి పాకిస్థాన్ కథ ఈ టీ20 వరల్డ్ కప్ లో అడ్డదిడ్డంగా తిరిగిపోయింది. వరల్డ్ కప్ కి ముందు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న పాక్ ఆటగాళ్లు.. ఎంతైనా పెద్దన్న యూఎస్ఏ క్రికెట్ ఆర్మీ ముందు నిలవలేకపోయారు. అది సరే నిన్న యూఎస్ఏ, ఐర్లాండ్ మధ్య లీగ్ మ్యాచ్ ఉంది. ఐర్లాండ్ ఏదైనా అద్భుతం చేసి USAని ఆపితే చాలు... తమ లాస్ట్ మ్యాచ్ లో అదే ఐర్లాండ్ ను మట్టికరిపించి యూఎస్ఏ ను వెనక్కి నెట్టి సూపర్ 8 కి వెళ్లిపోదాం అనుకున్నారు పాకిస్తాన్ ఆటగాళ్లు. కానీ దేవుడు ష్క్రిప్టు వేరేది రాశాడు.

 

ఫ్లోరిడాలో కురిసిన భారీ వర్షం కారణంగా యూఎస్ఏ, ఐర్లాండ్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దైంది. దీంతో ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక్క పరాజయం, ఒక్క రద్దైన మ్యాచ్ తో ఐదుపాయింట్లు సాధించిన యూఎస్ఏ సూపర్ 8కి అర్హత సాధించేసింది. పాకిస్థాన్ తమ చివరి మ్యాచ్ ఐర్లాండ్ మీద నెగ్గినా నాలుగు పాయింట్లే వస్తాయి కాబట్టి పాక్ ఎలినిమేట్ అయిపోయింది.  

 

గ్రూప్ లో ఇప్పటికే టీమిండియా సూపర్ 8కి అర్హత సాధించగా..ఇప్పుడు యూఎస్ఏ కూడా అర్హతసాధించి చరిత్ర సృష్టించింది. భారత్ తన ఆఖరి మ్యాచ్ కెనడాతో ఉంది. అది వర్షం కారణంగా రద్దైనా మరో పాయింట్ వస్తుంది కాబట్టి 7  పాయింట్లు సాధించి గ్రూపులో మొదటిస్థానంతోనే సూపర్ 8కి వెళ్తుంది. ఒకవేళ గెలిస్తే 8పాయింట్లు, పొరపాటున ఓడినా మెరుగైన రన్ రేట్ ఉన్నకారణంగా అదే 6పాయింట్లతో సూపర్ 8కి మొదటిస్థానంలోనే వెళ్తుంది. 2022లో టీమిండియా టీ20 వరల్డ్ కప్ లో ఎలిమినేట్ అయినప్పుడు బైబై ఇండియా అంటూ మీమ్స్ వేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఇప్పుడు టీమిండియా ఫ్యాన్సు అవే మీమ్స్ తో చెడుగుడు ఆడుకుంటున్నారు.

 

టీ 20 ప్రపంచకప్‌( T20 World Cup)లో పాకిస్థాన్‌(Pakistan) ప్రయాణం ముగిసింది. ఐర్లాండ్‌(Ireland)-అమెరికా(URL) మధ్య జరగాల్సిన మ్యాచ్‌ ఒక్క బంతి పడకుండానే రద్దు కావడంతో పాక్ గుండె బద్దలైంది. మరోసారి ఐసీసీ(ICC) ప్రపంచకప్‌లో పాక్‌ లీగ్‌ దశలోనే వెనుదిరిగి అపఖ్యాతి మూటగట్టుకుంది. ఈ మెగా టోర్నీలో లీగ్‌ దశలో ఆడిన మ్యాచ్‌లో అమెరికా చేతిలో పరాజయం పాలు కావడం పాక్‌ కొంపముంచింది. అనంతరం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాక్‌ సూపర్‌ ఎయిట్‌ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఐర్లాండ్‌-అమెరికాల మధ్య మ్యాచ్‌ జరిగి అమెరికా పరాజయం పాలైతే పాక్‌కు సూపర్‌ ఎయిట్‌ అవకాశాలు ఉండేవి. కానీ పాకిస్థాన్‌ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఐర్లాండ్‌-అమెరికా మధ్య జరగాల్సిన మ్యాచ్‌ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి పడకుండానే రద్దైంది. మధ్యలో కాస్త వర్షం తెరిపినిచ్చినా.. అవుట్‌ ఫీల్డ్‌ మొత్తం చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ ప్రారంభించడం సాధ్యం కాలేదు. కాసేపటి తర్వాత మళ్లీ భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ప్రకటనతో మ్యాచ్‌ కోసం ఎదురుచూసిన పాక్‌ ఆటగాళ్లు, అభిమానులు నిశ్చేషులు అయ్యారు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనూ లీగ్‌ దశలోనే వెనుదిరిగిన పాక్.. ఇప్పుడు టీ 20 ప్రపంచకప్‌లోనూ లీగ్‌ దశలోనే వెనుదిరగడం ఆ దేశ అభిమానులకు మింగుడు పడడం లేదు.

 

ఆశలపై నీళ్లు

అమెరికా-ఐర్లాండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడం పాక్‌కు శరాఘాతంగా మిగిలింది. కనీసం అయిదు ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించేందుకు కూడా అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఈ రద్దుతో ఐర్లాండ్‌-అమెరికాకు చెరో పాయింట్‌ కేటాయించారు. ఈ పాయింట్‌తో అయిదు పాయింట్లతో గ్రూప్‌ ఏ నుంచి అమెరికా సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధించింది. టీమిండియా ఇప్పటికే ఆరు పాయింట్లతో సూపర్‌ ఎయిట్‌ బెర్తు దక్కించుకుంది. ఇప్పటికి మూడు మ్యాచులు ఆడి ఒక విజయం.. రెండు పరాజయాలతో రెండు పాయింట్లతో మూడో  స్థానంలో ఉన్న పాక్‌కు మరో మ్యాచ్‌ ఆడే అవకాశం ఉంది. ఆ మ్యాచ్‌లో గెలిచినా పాక్‌ పాయింట్లు కేవలం నాలుగుకు చేరుతాయి. అమెరికా వద్ద ఇప్పటికే అయిదు పాయింట్లతో ఉండడంతో ఆ దేశం బెర్తు ఖాయమైంది. పాపం పాక్‌ చివరి మ్యాచ్‌లో గెలిచినా నాలుగు పాయింట్లే ఉండడంతో సూపర్‌ ఎయిట్‌ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి.

 

సూపర్ ఎయిట్‌లో అమెరికా

టీ ట్వంటీ ప్రపంచకప్‌లో తొలిసారి ఆడుతున్న ఆతిథ్య  అమెరికా అదరగొట్టింది. అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే సూపర్‌ ఎయిట్‌కు అర్హత సాధించింది. లీగ్‌ దశలో పాక్‌కు షాక్‌ ఇచ్చిన అమెరికా... భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పోరాడింది. కానీ ఇప్పటివరకూ స్వదేశంలోనే మ్యాచ్‌లు ఆడిన అమెరికా ఇక వెస్టిండీస్‌లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సొంత దేశంలో అద్భుతాలు చేసిన అమెరికా... ఇక కరేబియన్‌ పిచ్‌లపైనా రాణించి ఏమైనా సంచలనాలు నమోదు చేస్తుందేమో చూడాలి.