Tanveer Sangha Profile: ఐదు సార్లు వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా ఈ ఏడాది  భారత్ వేదికగా జరుగబోయే  ప్రపంచకప్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టింది. ఆగస్టు, సెప్టెంబర్‌లలో భారత్, దక్షిణాఫ్రికాలతో  వన్డేలు ఆడనున్న కంగారూలు.. ఆ తర్వాత ప్రపంచకప్‌లో ఆడనున్నారు. ఈ మేరకు తాజాగా  క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. ప్రపంచకప్ కోసం ప్రిలిమినరీ స్క్వాడ్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టులో  అనూహ్యంగా భారత సంతతికి చెందిన ఆటగాడు, లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా చోటు దక్కించుకున్నాడు. అసలు ఎవరీ తన్వీర్..? భారత్‌తో అతడికి ఏం సంబంధం..? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం. 


ఎవరీ తన్వీర్..? 


ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌లో న్యూసౌత్ వేల్స్ తరఫున ఆడుతున్న తన్వీర్ తండ్రి  జోగా సంఘా.. 1997లో భారత్ నుంచి ఆసీస్‌కు వలసవెళ్లాడు.  జోగాది పంజాబ్ రాష్ట్రంలోని జలందర్‌కు సమీపంలో ఉన్న  రహీమ్‌పూర్ గ్రామం.   బతుకుదెరువు కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన జోగా.. సిడ్నీలో ట్యాక్సీ డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. అతడి భార్య అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. అక్కడికి వెళ్లాకే వారికి తన్వీర్  జన్మించాడు. 


చిన్ననాటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి కనబరిచిన తన్వీర్.. పదో యేటనే క్రికెట్ అకాడమీలో చేరి  ఆటలో ఓనమాలు నేర్చుకున్నాడు.  2020లో జరిగిన అండర్ -19  వరల్డ్ కప్‌లో ఆసీస్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన అతడు బిగ్ బాష్ లీగ్‌లో కూడా సత్తా చాటాడు.   గత సీజన్‌లో తన్వీర్..  సిడ్నీ థండర్స్ తరఫున గ్రూప్ స్టేజ్‌లో 21 వికెట్లు కూడా పడగొట్టాడు. దేశవాళీలో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన సంఘా.. 2021లో  న్యూజిలాండ్‌తో టీ2‌ సిరీస్‌కు ఎంపికైనా  తుదిజట్టులో ఆడే అవకాశం రాలేదు.కానీ ఇప్పుడు  ఏకంగా వన్డే వరల్డ్ కప్  స్క్వాడ్‌లో చోటు దక్కించుకోవడం గమనార్హం. 


 






నేను క్రికెట్ చూడలేదు : జోగా 


కొడుకును క్రికెటర్‌ను చేసిన జోగా ఇండియాలో ఉన్నప్పుడు క్రికెట్ చూడలేదట. తన కొడుకును కూడా  రెజ్లర్ చేద్దామని అనుకున్నాడట.  ఇదే విషయమై  జోగా మాట్లాడుతూ.. ‘భారత్‌లో ఉన్నప్పుడు నేను క్రికెట్ చూసేవాడిని కాదు. రెజ్లింగ్ అంటే చాలా ఇష్టపడేవాడిని. కబడ్డీ, వాలీబాల్ కూడా ఆడేవాడిని.   ఇక్కడ (ఆస్ట్రేలియాలో) కూడా మాకు వింటర్‌లో రెజ్లింగ్ టోర్నమెంట్స్ ఉంటాయి. తన్వీర్ నాతో  మ్యాచ్‌లు చూసేందుకు వచ్చేవాడు. పలుమార్లు జూనియర్ పోటీలలో పాల్గొన్నాడు.  అయితే పదేండ్లు వచ్చాక అతడికి క్రికెట్ లో ఉన్న ఆసక్తిని గమనించి.. స్థానికంగా ఉండే ఇంగ్లిబర్న్ ఆర్ఎస్ఎల్ క్లబ్‌లో చేర్పించాం.   క్రికెట్ అకాడమీలో తన్వీర్‌ను నేనే నా కార్లోనే పికప్, డ్రాప్ చేసేందుకు కొన్ని రైడ్స్‌ను స్కిప్ చేసేవాడిని.  ఆ సమయాన్ని మళ్లీ  ఉదయాన గానీ రాత్రి గానీ కవర్ చేసుకునేవాడిని..’అని కొడుకు గురించి చెప్పుకొచ్చాడు. 


 






కాగా  ఆస్ట్రేలియా ఎంపిక చేసిన  18 మంది సభ్యుల జాబితాలో స్టార్ బ్యాటర్ మార్నస్ లబూషేన్ పేరు లేకపోవడం గమనార్హం. 


వరల్డ్ కప్ కోసం ఆసీస్ ఎంపికచేసిన జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ కేరీ, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, ఆరోన్ హార్డి, జోష్ హెజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడం జంపా 
























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial