Ind Vs Wi 2nd Test day 3 Latest Updates: ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ పోరాడుతోంది. ఆదివారం మూడోరోజు 270 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్.. ఆట ముగిసే సరికి 49 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసింది. ఓపెనర్ క్యాంబెల్ సూపర్బ్ ఫిఫ్టీ (145 బంతుల్లో 87 బ్యాటింగ్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు)తో టాప్ స్కోరర్ గా నిలిచి, కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. క్రీజులో అతనితోపాటు షాయ్ హోప్ (103 బంతుల్లో 66 బ్యాటింగ్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) ఉన్నాడు. బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్ కు తలో వికెట్ దక్కింది. ఇంకా 97 పరుగుల దూరంలో విండీస్ నిలిచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ ను భారత్ 5 వికెట్లకు 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కాగా వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకు ఆలౌట్ అయింది. అహ్మదాబాద్ లో జరిగిన తొలి టెస్టును ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచిన భారత్ రెండుటెస్టుల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో ఉంది.
పోరాడిన క్యాంబెల్, హోప్..
అంతకుముందు 270 పరుగుల లోటుతో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ త్యాగనారయణ్ చందర్ పాల్ (10) ర్యాష్ షాట్ ఆడి, మరోసారి విఫలమయ్యాడు. సిరాజ్ బౌలింగ్ లో పుల్ షాట్ కు ప్రయత్నించి, కెప్టెన్ శుభమాన్ గిల్ సూపర్బ్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఆ తరవాత తొలి ఇన్నింగ్స్ టాప్ స్కోరర్ అతనాజ్ (7)ను వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ చేశాడు. దీంతో 35 పరుగులకే రెండు వికెట్లకు కోల్పోయింది. ఈ దశలో క్యాంబెల్-హోప్ జంట అద్భుత పోరాట పటిమ ప్రదర్శించింది. వీరిద్దరూ సాధికారికంగా ఆడి, మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
కెరీర్ బెస్ట్ స్కోరు..
ఈ మ్యాచ్ కు ముందు 68 పరుగుల వ్యక్తిగత స్కోరు ఉన్న క్యాంబెల్.. ఈ మ్యాచ్ లో సత్తా చాటి తన అత్యుత్తమ స్కోరును నమోదు చేశాడు. అలాగే వడివడిగా కెరీర్ మెయిడిన్ సెంచరీ వైపు దూసుకెళుతున్నాడు. అంతకుముందు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని 69 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో హోప్ కూడా సమయోచితంగా ఆడి 80 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన మూడో వికెట్ కు 138 పరుగులను జత చేశారు. ఈక్రమంలో మూడో సెషన్ మొత్తం మీద ఒక వికెట్ పడకుండా విండీస్ రోజును ముగించింది. అంతకుముందు ఆదివారం మూడోరోజు 140-4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్.. 81.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాటర్ ఆలిక్ అతనాజ్ (41) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు ఐదు వికెట్లు దక్కాయి. దీంతో భారత్ కు 270 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.