టీమిండియా సెలక్షన్‌ విధానంపై మాజీ దిగ్గజ క్రికెటర్‌ అజయ్‌ జడేజా విమర్శలు గుప్పించాడు. ఇదేం విధానమంటూ మండిపడ్డాడు. ఇండియన్ క్రికెట్‌లో ఇది కొత్త కాదని, సెలక్ట్ చేయడం కాదు రిజెక్ట్ చేస్తారని తీవ్ర విమర్శలు గుప్పించాడు. భారత జట్టులోకి ఆటగాళ్ల ఎంపికపై కన్నా ఎవరిని తొలగించాలనే విషయంపైనే బీసీసీఐ పెద్దలు దృష్టి పెడతారంటూ అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడే కాదు గతంలో కూడా బీసీసీఐ తీరు ఇలాగే ఉందని విమర్శించాడు. యువ ఆటగాడు ఇషాన్ కిషాన్‌ను పక్కన పెట్టడాన్ని తప్పుబడుతూ జడేజా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకోవడంలో ఇషాన్‌ కిషన్‌ కూడా కీలక పాత్ర పోషించాడు. తొలి మూడు మ్యాచుల్లో ఆడిన ఇషాన్‌ కిషన్‌కు చివరి రెండింట్లో విశ్రాంతినిచ్చారు.  ఈ తీరును అజయ్ జడేజా తప్పుపట్టాడు. ఈ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన ఆటగాడిని ఎలా పక్కన పెడతారంటూ నిలదీశాడు. 



 ఇషాన్ కిషన్‌ను ఆస్ట్రేలియాతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లకు పక్కన పెట్టడంపై అజయ్ జడేజా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇషాన్‌కు పదే పదే అన్యాయం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డాడు. ఇషాన్ కిషన్‌లో ప్రతిభావంతుడైన ఆటగాడు ఉన్నాడని, తనదైన రోజున అతడు జట్టును భుజాన మోస్తాడని జడేజా చెప్పాడు. ఇషాన్‌ కిషన్‌ వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడని... అయినా అతడికి అవకాశాలు తక్కువగానే వస్తున్నాయని జడేజా అన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లకే పరిమితమయ్యాడని.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లోనైనా అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడించాల్సిందని తెలిపాడు. మూడు మ్యాచ్‌ల తర్వాత విశ్రాంతి అంటూ ఇషాన్‌ను ఇంటికి పంపించారని.. ఇలాగే కొనసాగితే ఇషాన్‌ కిషన్‌ ఎప్పుడు పరిపూర్ణ క్రికెటర్‌గా మారతాడని అజయ్ జడేజా ప్రశ్నల వర్షం కురిపించాడు. తనదైన రోజున మ్యాచ్‌ గమనాన్నే కిషన్‌ మార్చేయగలడని.. అలాంటి ఆటగాడిని కూడా తరచూ పక్కన పెట్టడం సరైంది కాదని తేల్చి చెప్పాడు. అలాంటి ఆటగాడికి తగినన్ని అవకాశాలను కల్పించి జట్టులో కుదురుకునేందుకు సమయం ఇవ్వాలని సూచించాడు. అయితే, బీసీసీఐ తీరు మాత్రం ప్లేయర్ల సెలక్షన్‌పై కాకుండా జట్టులో నుంచి ఎవరిని తప్పించాలన్న విషయంపైనే ఉంటుందని జడేజా మండిపడ్డారు. 



ఓ ఆటగాడు పూర్తిస్థాయి ప్లేయర్‌గా మారాలంటే తగినన్ని అవకాశాలు, సమయం ఇవ్వాల్సిందేనని అజయ్‌ జడేజా వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ఇషాన్‌ కిషన్‌ను టీమ్‌ఇండియాఎంపిక చేసింది. వన్డేలు మినహా టెస్టులు, టీ20ల స్క్వాడ్‌లో ఇషాన్‌కు చోటు దక్కింది. వన్డేలకు సంజూ శాంసన్‌కు రెండో వికెట్‌ కీపర్‌గా అవకాశం కల్పించింది. 



 అజయ్‌ జడేజా శిక్షణలో వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ అద్భుతాలు సృష్టించింది. అఫ్గాన్ విజయాలు అందుకోవడం వెనుక అజయ్ జడేజా ఉన్నాడు. వన్డే ప్రపంచకప్ ముందే అజయ్ జడేజాను అఫ్గాన్ మెంటార్‌గా నియమించుకుంది. భారత్ పిచ్‌లు, వాతావరణ పరిస్థితులపై మంచి అవగాహన ఉన్న అజయ్ జడేజా సాయంతో ప్రణాళికలను సిద్దం చేసుకొని అఫ్గాన్ బరిలోకి దిగింది. టీమిండియా తరఫున సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన అజయ్ జడేజా అనుభవం అఫ్గాన్‌కు కలిసొచ్చింది. అతని మార్గదర్శకంలో అఫ్గాన్ రెండు సంచలన విజయాలు నమోదు చేసింది. దాంతో జడేజాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది.  అఫ్గాన్ చరిత్రాత్మక విజయంలో అజయ్ జడేజా పాత్ర కూడా తక్కువేమీ కాదంటూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ట్వీట్‌ కూడా చేశాడు.