Kohli vs Ganguly: రెండేండ్ల క్రితం భారత క్రికెట్ పరువును నడిబజారుకు ఈడ్చిన వివాదం మళ్లీ  కొత్త రంగు పులుముకుంటుందా..? బీసీసీఐ మాజీ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ మీద  కోహ్లీకి ఇంకా కోపం చల్లారలేదా..?  అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.  తనను అకారణంగా  కెప్టెన్సీ నుంచి తప్పించారనే కోపంతో విరాట్ కోహ్లీ..  సౌరవ్ గంగూలీపై  బహిరంగంగానే విమర్శలు గుప్పించడం.. అవి కాస్తా బోర్డులో లొసగులను బట్టబయలు  చేయడం  అప్పట్లో వివాదాస్పదమైంది. రెండేండ్లు గడిచిన తర్వాత  కోహ్లీ ఇప్పుడు  దాదాపై పగ తీర్చుకునే పనిలో పడ్డాడని వాదనలు వినిపిస్తున్నాయి. 


ఉరిమి చూపులు.. అన్‌ఫాలో వెనుక..? 


కొద్దిరోజుల క్రితమే ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయి ‘నాటి నిజాలు’ శీర్షికన మొత్తం అప్పటి ఎపిసోడ్‌ను ఏకరువు పెట్టిన సెలక్షన్ కమిటీ చైర్మెన్  చేతన్ శర్మ  వ్యాఖ్యలతో ‘కోహ్లీకి అన్యాయం జరిగింది నిజమే’నని  ప్రేక్షకులకు అర్థమైంది. ఇప్పుడు  కోహ్లీ ‘అప్నా టైమ్ ఆగయీ’ అంటూ  దాదాపై  పగ తీర్చుకుంటుండటంతో కొత్త వివాదానికి బీజం పడ్డట్టే కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలు దీనికి బలమైన ఆధారాలుగా నిలుస్తున్నాయి. తాజాగా కోహ్లీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గంగూలీని ‘అన్‌ఫాలో’ చేయడంతో  ‘దాల్ మే కుచ్ కాలా హై’ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  


 






మూడు రోజుల క్రితం ఆర్సీబీ - ఢిల్లీ మ్యాచ్‌లో  కోహ్లీ.. గంగూలీని  డగౌట్ లో ఉరిమి ఉరిమి చూడటం,  ఆట ముగిశాక షేక్  హ్యాండ్ ఇవ్వకుండా తప్పించుకోవడంతో పాటు  మళ్లీ ప్రాక్టీస్ కోసం  కోహ్లీ సిద్ధమవుతండగా అటుగా వెళ్తున్న దాదాపైకి  కోపంగా చూడటం వంటివి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.  మామూలుగానే కోహ్లీ  ఫీల్డ్ లో అగ్రెసివ్ గా ఉంటాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో  అది ఇంకాస్త ఎక్కువైంది. ఈ మ్యాచ్ ఢిల్లీ -  ఆర్సీబీ మధ్య  జరిగినా కోహ్లీ అభిమాన గణం మాత్రం కోహ్లీ వర్సెస్  దాదా గానే చిత్రీకరించింది.  మ్యాచ్  ఓడాక దాదా  తలదించుకోవడం  కోహ్లీ ముఖం చూడలేకేనని   సోషల్ మీడియాలో  కొత్త కొత్త వాదనలు  వినిపించాయి.  


ఇక దీనికి కొనసాగింపా..? అన్నట్టుగా  తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో కోహ్లీ చేసిన పని కూడా ఈ అనుమానాలకు మరింత బలాన్నిచ్చింది. కోహ్లీ ఇన్‌స్టాలో 277 మందిని ఫాలో అవుతాడు. కానీ ఢిల్లీతో మ్యాచ్ ముగిశాక  అతడు ఫాలో అవుతున్నవారి సంఖ్య 276 కు పడిపోయింది. ‘ఇంతకీ కోహ్లీ అన్‌ఫాలో చేసిన మహానుభావుడు ఎవరబ్బ..?’ అని సోషల్ మీడియా పండితులు తలలు పట్టుకోగా వచ్చిన సమాధానం దాదానే.


 






అప్పుడు ఏం జరిగింది..? 


2021లో  దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ తర్వాత కోహ్లీ టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు.   అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ.. టీమిండియాకు  ‘స్ప్లిట్ కెప్టెన్సీ’  నప్పదని కోహ్లీతో వారించినా  అతడు విన్లేదని దాదా వ్యాఖ్యానించాడు.  కోహ్లీ టీ20 పగ్గాలు వదిలేసి రెండు నెలలకు భారత వన్డే జట్టుకు కొత్త సారథిగా రోహిత్ వచ్చాడు.   ఇది కూడా వివాదాస్పద నిర్ణయమే.  వాస్తవానికి టీ20 కెప్టెన్సీ వదిలేసినా  వన్డేలకు 2023 వరల్డ్ కప్ వరకూ  సారథిగా ఉండాలని  కోహ్లీ భావించాడు. కానీ  2021 డిసెంబర్‌లో  భారత జట్టు సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందు కోహ్లీని వన్డేల నుంచి తప్పించింది బీసీసీఐ.  ఈ విషయం కూడా తనకు గంట ముందుగా చెప్పారని విరాట్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఒకానొక సమయంలో  బీసీసీఐ వర్సెస్ కోహ్లీ అనేంత రేంజ్ కు వెళ్లింది ఈ గొడవ. సోషల్ మీడియాలో  కోహ్లీ  ఫ్యాన్స్.. దాదాపై ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. చేతన్ శర్మ కూడా స్టింగ్ ఆపరేషన్ లో  దాదాకు కోహ్లీ అంటే పడదని.. అతడిని బలవంతంగా కెప్టెన్సీ నుంచి తప్పించాడని కామెంట్స్ చేసిన విషయం విదితమే..