BCCI Prize Money: ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీసీసీఐ.. దేశవాళీ క్రికెట్ ఆడే క్రీడాకారులకు శుభవార్త అందజేసింది.  దేశీయ టోర్నీలలో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీని భారీగా పెంచింది.  దేశవాళీ క్రికెట్‌కు ఆయువు పట్టుగా ఉండి  భారత జాతీయ క్రికెట్‌కు ఆటగాళ్లను అందించే కర్మాగారంగా ఉన్న రంజీ ట్రోఫీకి ఇకనుంచి భారీగా నగదు బహుమానం అందనుంది.   ఇన్నాళ్లు రంజీ ట్రోఫీ విజేతలకు  రూ. 2 కోట్ల ప్రైజ్‌మనీ ఇస్తుండగా  వచ్చే  సీజన్ నుంచి దీనిని  ఏకంగా రూ. 5 కోట్లకు పెంచారు.  


ఈ మేరకు  బీసీసీఐ కార్యదర్శి  జై షా ఈ విషయాన్ని   ట్విటర్ ద్వారా వెల్లడించాడు. రంజీతో పాటు ఇతర దేశవాళీ టోర్నీలు, మహిళలు  పాల్గొనే టోర్నీలకూ  నగదు బహుమానాన్ని పెంచుతున్నట్టు తెలిపాడు. భారత క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచే డొమెస్టిక్ క్రికెట్‌కు   ప్రోత్సాహం  అందించడంలో తాము  వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, పెంచిన  ప్రైజ్ మనీకి సంబంధించిన వివరాలను  ట్విటర్‌లో షేర్ చేశాడు. 


రంజీలకు రాజయోగం.. 


దేశవాళీ క్రికెట్‌కు ఆయువు పట్టైన  రంజీ విజేతలకు ఇకనుంచి  రూ. 5 కోట్ల క్యాష్ ప్రైజ్ అందనుండగా  రన్నరప్‌కు  గతంలో కోటి రూపాయలు అందిస్తుండగా ఇప్పుడు దానిని రూ. 3 కోట్లకు పెంచరారు.  సెమీఫైనల్‌లో ఓడిన జట్లకు   రూ. 50 లక్షలు ఇస్తుండగా  ఇకనుంచి  దానిని కోటి రూపాయలకు పెంచారు. ఈ ఏడాది రంజీ సీజన్‌లో సౌరాష్ట్ర  జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో సౌరాష్ట్ర.. బెంగాల్ ను ఓడించి టైటిల్ నెగ్గింది.  


- రంజీలతో పాటు ఇరానీ కప్ విజేతలకు గతంలో రూ. 25 లక్షలు ఇస్తుండగా ఇకనుంచి అది రూ. 50 లక్షలు కానుంది.  రన్నరప్‌కు గతంలో  ప్రైజ్ మనీ ఏమీ లేదు. కానీ ఇకనుంచి  ఫైనల్‌లో ఓడినవారికి రూ. 25 లక్షలు అందనుంది. 


- దులీప్ ట్రోఫీ విజేతలకు గతంలో  రూ. 40 లక్షలు ఇస్తుండగా  దానికి కోటి రూపాలయలకు  పెంచారు. ఫైనల్ లో ఓడినవారికి రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలు అందివ్వనున్నారు. 


- దేవదర్   ట్రోఫీలో  గెలిచినవారికి  రూ. 25 లక్షలు, ఓడినవారికి  రూ. 15 లక్షలు అందజేస్తుండగా దానిని రూ. 40 లక్షలు,  రూ. 20 లక్షలకు పెంచారు.  


- సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీ  విన్నర్స్‌కు  రూ. 25 లక్షలు,  ఫైనల్స్  పరాజితులకు  రూ.  10 లక్షలు అందిస్తుండగా   ఇకనుంచి దానిని రూ. 80 లక్షలు, రూ. 40 లక్షలకు పెంచనున్నారు. 


 






మహిళల క్రికెట్‌కు భారీగా.. 


పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకూ  సమాన వేతనాలు అందిస్తున్న  బీసీసీఐ..  దేశవాళీలో  వారికి నిర్వహించే సీనియర్ ఉమెన్స్ వన్డే ట్రోఫీ విజేతలకు గతంలో  రూ.  6 లక్షలు, రన్నరప్‌కు రూ. 3 లక్షలే అందించేది.   కానీ ఇకనుంచి అది  రూ. 50 లక్షలు,  రూ. 25 లక్షలు కానుంది.    అలాగే సీనియర్ ఉమెన్స్ టీ20 ట్రోఫీలో గెలిచినవారికి  రూ. 5 లక్షలు, ఓడినవారికి  రూ. 3 లక్షలు ఇస్తుండగా దానిని రూ.  40 లక్షలు, రూ. 20 లక్షలకు పెంచారు.