IPL 2023: వాంఖెడే వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ (ఎంఐ) గెలిచినా షాకులు తప్పలేదు. ఆ జట్టుకు రోహిత్ శర్మ గైర్హాజరీలో సారథిగా వ్యవహరించిన సూర్యకుమార్ యాదవ్‌కు ఫైన్ పడింది. ఇక నిన్నటి మ్యాచ్‌లో వాగ్వాదానికి దిగిన ముంబై బౌలర్ హృతీక్ షోకీన్‌తో పాటు కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రాణాలు బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యారు.
తిక్క కుదిరింది..
ఈ మ్యాచ్‌లో నితీశ్ రాణా - షోకీన్‌లు వాగ్వాదానికి దిగి బూతులు తిట్టుకున్నారు. షోకీన్ వేసిన 9వ ఓవర్ మొదటి బంతికి రమన్‌దీప్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి రాణా ఔటయ్యాడు. ఈ సందర్భంగా ఫోకీన్ ఏదో అనడం చూసిన రానా అతడి మీదికి వాగ్వాదానికి దిగాడు. అభ్యంతరకరమైన భాషతో షోకీన్‌ను దూషించాడు. షోకీన్ కూడా తగ్గకపోవడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన ముంబై ఇండియన్స్ స్టాండ్ ఇన్ కెప్టెన్ సూర్యతో పాటు ఇషాన్, ఇతర ఎంఐ ఆటగాళ్లు ఇద్దరిని శాంతింపచేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత బీసీసీఐ ఈ ఇద్దరికీ జరిమానా విధించింది.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని 2.5 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను షోకీన్‌కు బీసీసీఐ.. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది. ఇక రాణా చర్య ఐపీఎల్ రూల్ ఆఫ్ కండక్ట్ లోని రూల్ 2.21 ను ఉల్లంఘించినందుకు అతడికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. ఇవి మొదటిసారి తప్పులుగా భావిస్తూ బీసీసీఐ ఫీజులో కోతతో సరిపెట్టింది. ఇది మరోసారి రిపీట్ అయితే ఒక్క మ్యాచ్ నిషేధం కూడా ఉండొచ్చు. కాగా.. దేశవాళీ క్రికెట్‌లో ఈ ఇద్దరూ ఢిల్లీ జట్టుకు ఆడేవాళ్లే కావడం గమనార్హం.
సూర్యకూ తప్పలేదు..
రోహిత్‌కు కడుపునొప్పితో సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌లో ఎంఐ సారథిగా ఉన్నాడు. అయితే నిర్ణీత సమయంలో ఓవర్లను పూర్తి చేయనందుకు (స్లో ఓవర్ రేట్) గాను సూర్యకు రూ. 12 లక్షల జరిమానా పడింది. ఐపీఎల్‌లో ఒక కెప్టెన్ స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేస్తే అతడికి మొదటిసారి తప్పిదం అయితే రూ. 12 లక్షల జరిమానా ఉంటుంది. రెండోసారి రిపీట్ అయితే జరిమానా రెట్టింపు అవుతుంది. మూడోసారి అయితే ఒక మ్యాచ్ లో నిషేధం కూడా విధించే అవకాశం ఉంటుంది. ఈ సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాకు గురైన నాలుగో కెప్టెన్ సూర్య. ఇంతకుముందు ఫాఫ్ డుప్లెసిస్ (ఆర్సీబీ), సంజూ శాంసన్ (రాజస్తాన్ రాయల్స్), హార్ధిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) లు స్లో ఓవర్ రేట్ బాధితులే.
ఇక నిన్న ముంబై - కోల్‌కతా మధ్య ముగిసిన మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ సెంచరీ (104) తో చెలరేగాడు. అనంతరం భారీ లక్ష్యాన్ని ముంబై.. 17.4 ఓవర్లలోనే ఛేదించింది. ఇషాన్ కిషన్ (58) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు సూర్యకుమార్ యాదవ్ (43), తిలక్ వర్మ (30) లు రాణించడంతో ముంబైకి ఈ సీజన్‌లో రెండో విజయం దక్కింది.