Virat Kohli Spit on Dean Elgar:  టీమిండియా స్టార్‌ ఆటగాడు, కింగ్‌ కోహ్లీ(Virat Kohli)పై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ‌డీన్‌ ఎల్గర్‌(Dean Elgar) సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీకి, తనకు మధ్య గతంలో జరిగిన ఓ సంచలన విషయాన్ని ఎల్గర్ తాజాగా వెల్లడించాడు.  ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఎల్గర్‌ ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. తాను మొదటిసారి భారత పర్యటనకు వెళ్లినపుడు కోహ్లీ తనపై ఉమ్మి వేశాడని తెలిపాడు.  ఆ సంఘటన జరిగిన రెండు ఏళ్ల తర్వాత కోహ్లి తనకు క్షమాపణలు చెప్పాడని ఎల్గర్‌ తెలిపాడు. ఎల్గర్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. 2015లో తొలిసారి తాను భారత పర్యటనకు వెళ్లానని.. సరిగ్గా అదే సమయంలో విరాట్ కోహ్లి టీమిండియాటెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడని ఎల్గర్‌ గుర్తు చేసుకున్నాడు. 


ఎల్గర్‌ అసలు  ఏం చెప్పాడంటే..?
మొదటి టెస్టులో తాను బ్యాటింగ్‌కు వచ్చానని.. కోహ్లిని ప్రత్యక్షంగా చూడటం కూడా అదే తొలిసారని అన్నాడు. టర్నింగ్‌ వికెట్‌పై అశ్విన్‌, జడేజాను ఎదుర్కొవడం కష్టంగా మారిందని... అంతేకాకుండా వారిద్దరూ నన్ను స్లెడ్జ్‌ చేయడం మొదలు పెట్టారని ఆనాటి ఘటనలను ఎల్గర్‌ గుర్తు చేసుకున్నాడు. ఈ సమయంలో కోహ్లి తనపై ఉమ్మివేశాడని.. తాను కూడా అసభ్య పదజాలం వాడి బ్యాట్‌తో కొడతానని హెచ్చరించానని ఎల్గర్‌ అన్నాడు. తాను మాట్లాడిన బాష కోహ్లి అర్ధమైంది అనుకునున్నానని కానీ కోహ్లి కూడా అదే పదాన్ని వాడి నన్ను తిట్టడం మొదలు పెట్టాడని అన్నాడు. కోహ్లీ స్లెడ్జింగ్‌ను తాను పట్టించుకోలేదని... ఎందుకంటే మేం భారత్‌లో ఉన్నామని.. మేం తగ్గి ఉండాల్సిందేని అన్నాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తర్వాత ఏబీ డివిల్లియర్స్ కోహ్లీని ప్రశ్నించాడని... రెండేళ్ల తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వచ్చిందని... అప్పుడు కోహ్లీ తనకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాడని ఎల్గర్‌ అన్నాడు. సిరీస్ ముగిసిన తర్వాత కలిసి డ్రింక్ చేద్దామా అని కోహ్లీ అడిగాడని... అందుకు తాను అంగీకరించానని.. సిరీస్ పూర్తవగానే ఇద్దరం పార్టీ చేసుకున్నామని... వేకువజామున 3 గంటల వరకు తాగుతూనే ఉన్నామని ఎల్గర్‌ తెలిపాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు క్రికెట్‌ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. 


ముగిసిన ఎల్గర్ శకం
ఇటీవలే దక్షిణాఫ్రికా క్రికెట్‌(South Africa Cricket)లో ఓ దిగ్గజ ఆటగాడి శకం ముగిసింది. టెస్ట్‌ క్రికెట్‌(Test Cricket)లో ప్రొటీస్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన డీన్‌ ఎల్గర్‌(Dean Elgar ) సుదీర్ఘ ఫార్మట్‌కు వీడ్కోలు పలికాడు. అరంగేట్ర టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్‌ అయిన స్థితి నుంచి జట్టుకు ఒంటి చేత్తో మరపురాని విజయాలు అందించే స్థాయికి డీన్‌ ఎల్గర్‌ ఎదిగాడు. టెస్ట్‌ క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి వికెట్ల ముందు గోడ కట్టి... ప్రతికూల పరిస్థితుల్లో సఫారీ జట్టుకు ఎన్నోసార్లు అద్భుత ప్రారంభాలను ఎల్గర్‌ అందించాడు. భారత్‌తో జరిగిన తొలి టెస్ట్‌లోనూ భారీ శతకంతో మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన ఎల్గర్‌... చివరి టెస్ట్‌లో సారధిగా కూడా వ్యవహరించాడు. 2012 నవంబర్‌లో ఆస్ట్రేలియా(Austrelia)పై టెస్టు అరంగేట్రం చేసిన ఎల్గర్‌ మొదట మిడిలార్డర్‌లో ఆడాడు. ఆ తర్వాత ఓపెనర్‌గా మారాడు. 12 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 86 టెస్టుల్లో 47.78 సగటుతో 5347 పరుగులు చేశాడు. ఇందులో 14 శతకాలు, 23 అర్ధసెంచరీలున్నాయి. 8 వన్డేలు మాత్రమే ఆడిన అతను 104 పరుగులు సాధించాడు. టీ20లు ఆడే అవకాశం రాలేదు. స్పిన్‌ బౌలింగ్‌తో టెస్టుల్లో 15 వికెట్లు కూడా సాధించాడు.