Rahul Dravid Reacts To Indias Rare Loss At Home: హైదరాబాద్‌(Hyderabad) వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా(Team India)కు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌ జట్టు అనూహ్య ఓటమిని చవి చూసింది. భారత జట్టు 28 పరుగుల తేడాతో తొలి టెస్టులో ఓటమి పాలైంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 1-0 ఆధిక్యాన్ని సాధించింది. టామ్‌ హార్టీలీ ఏడు వికెట్లతో భారత్‌ పతనాన్ని శాసించి బ్రిటీష్‌ జట్టుకు అపూరూపమైన విజయాన్ని అందించాడు. భారత జట్టు ఓటమితో రోహిత్‌ సేన ఆటతీరుపై మాజీలు మండిపడ్డారు. ఇదేం ఆటతీరంటూ విమర్శలు గుప్పించారు. ఈ పరాజయానికి కారణాలను ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) చెప్పాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు 80ల్లోనే ఔటయ్యారని... కనీసం మరో 70 పరుగులు చేసి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదని ద్రవిడ్‌ తెలిపాడు. మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పుడే ఇంకాస్త బాగా ఆడాల్సిందన్న హెడ్‌ కోచ్‌... కొన్ని మంచి ఆరంభాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు.

ఒక్కరైనా సెంచరీ చేసుంటే..
తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడే ఒక్క బ్యాటరైనా భారీ శతకం చేసి ఉంటే ఇంగ్లాండ్‌పై మరింత ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం దక్కేదని  ద్రవిడ్‌ తెలిపాడు. టెస్టుల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో 230 పరుగులే అయినా ఛేదించడం కష్టమని... యువ క్రికెటర్లు  ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత సమయం అవసరమని హెడ్‌ కోచ్‌ అన్నాడు. యువ క్రికెటర్లు తప్పకుండా భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశిస్తున్నానని ద్రవిడ్‌ అన్నాడు. నాణ్యమైన భారత బౌలింగ్‌లో ఓలీ పోప్‌ అద్భుతంగా ఆడడంపైనా టీమిండియా హెడ్‌ కోచ్‌ స్పందించాడు. తమ బౌలర్లు అనుకున్న ప్రణాళికలు అమలు చేయలేకపోయారని.. వచ్చే మ్యాచ్‌లో ఈ లోపాలను సరిచేసుకుని బరిలోకి దిగుతామని ద్రావిడ్‌ అన్నాడు.


మరీ ఇంత డిఫెన్సీవ్‌గానా...
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భారత్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడిందని మాజీ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik) విమర్శించాడు. పోప్‌ వంటి బ్యాటర్‌ విషయంలో డిఫెన్సివ్‌గా ఉండటంలో తప్పులేదని.. కానీ.. టామ్‌ హార్లీ వంటి టెయిలెండర్ల విషయంలోనూ అదే తరహాలో ఆడటం సరికాదన్నాడు. రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంకాస్త మెరుగ్గా అటాకింగ్‌ చేసి ఉంటే బాగుండేదన్న డీకే... టీమిండియా ఆటతీరు విస్మయానికి గురి చేసిందన్నాడు. సొంతగడ్డపై టీమిండియా ఇంతకు ముందెన్నడూ ఇంత బేలగా చూడలేదని రవిశాస్త్రి(Ravi Shastri) అన్నాడు. రోహిత్‌ సేన పూర్తిగా ఒత్తిడిలో కూరుకుపోవడం.. థర్డ్‌ ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టుకు 400 పైచిలుకు పరుగులు చేసే అవకాశం ఇవ్వడం తనని ఆశ్చర్యపరిచిందని అన్నాడు. భారత ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్‌ చూస్తుంటే ఆడుతుంది అసలు మనవాళ్లేనా అన్న సందేహం కలిగిందని కూడా అన్నాడు.


రెండో టెస్ట్‌కు జడేజా దూరం!
హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో పరాజయం పాలైన టీమిండియాకు మరో షాక్‌ తగిలే అవకాశం ఉందన్న వార్తలు సంచలనంగా మారాయి. తొలి టెస్ట్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja)... గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తొలి టెస్ట్‌ సందర్భంగా తొడ కండరాలు పట్టేయడంతో స్టార్‌ ఆటగాడు రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడని తెలుస్తుంది.