Virat Kohli: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో పాకిస్థాన్‌పై ఆడిన ఇన్నింగ్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేనని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంటున్నాడు. అదో అద్భుతమైన రాత్రిగా పేర్కొన్నాడు. క్రికెట్‌ మ్యాచులో అలాంటి ఎనర్జీని ఎప్పుడూ ఆస్వాదించలేదని వెల్లడించాడు. తన మనసులో మాటను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.


ఆస్ట్రేలియాలో జరిగిన మెగా టోర్నీలో టీమ్‌ఇండియా తన తొలి మ్యాచును పాకిస్థాన్‌తో ఆడింది. అక్టోబర్‌ 23న మెల్‌బోర్న్‌లో ఈ పోరుకు వేదికగా నిలిచింది. ఛేదనలో విరాట్‌ కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. నాలుగు వికెట్ల తేడాతో భారత్‌కు గెలుపు బోణీ అందించాడు. ఆఖరి ఓవర్లో టీమ్‌ఇండియాకు 16 పరుగులు అవసరం కాగా నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచాడు. అదే బంతిని అంపైన్‌ నోబాల్‌గా ప్రకటించడంతో మ్యాజిక్‌ జరిగింది. తర్వాతి బంతిని మహ్మద్‌ నవాజ్‌ వైడ్‌గా వేయడంతో గెలుపు సమీకరణం సులువైంది. ఫ్రీహిట్‌ బంతికి మూడు పరుగులొచ్చాయి. ఆ తర్వాత ఒక వైడ్‌, అశ్విన్‌ సింగిల్‌ తీయడంతో గెలుపు రోహిత్‌ సేన వశమైంది.




ప్రపంచకప్‌ తర్వాత సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌కు విరామం ఇచ్చింది. ప్రస్తుతం ఇంటి వద్దే సమయాన్ని ఆస్వాదిస్తున్న విరాట్‌ పాక్‌ మ్యాచును గుర్తు చేసుకున్నాడు. 'నా హృదయంలో 2022, అక్టోబర్‌ 23 ఎప్పటికీ ప్రత్యేకమే! క్రికెట్‌ మ్యాచుల్లో అలాంటి ఎనర్జీని మునుపెన్నడూ ఆస్వాదించలేదు. అదో బ్లెస్‌డ్‌ ఈవినింగ్‌' అని ట్వీట్‌ చేశాడు.


'నేను ఇన్నింగ్స్‌తో పాటే సాగాను. దొరికిన బంతిని బౌండరీకి పంపిస్తూ స్ట్రైక్‌ రొటేట్‌ చేశాను. హార్దిక్‌ నన్ను మరింత ముందుకు నెట్టాడు. మ్యాచ్‌ను మనం చివరి వరకు తీసుకెళ్లాలని సూచించాడు. సరైన సమయంలో నేను బౌండరీలు బాదాను. అప్పటికీ 3 ఓవర్లలో 50 పరుగులు చేయాలి. పైగా హ్యారీస్‌ రౌఫ్‌కు ఒక ఓవర్‌ ఉంది. అందుకే ఆట సవాల్‌గా మారుతుందని అనుకున్నా. రౌఫ్‌ను అటాక్‌ చేస్తే పాక్‌ భయపడుతుందని పాండ్యకు చెప్పాను. 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైనప్పుడు నన్ను నేను నమ్మాను. రెండు సిక్సర్లు కొట్టాను. లేదంటే మ్యాచ్‌ చేజారేదే' అని ఆ గేమ్ ముగిశాక విరాట్‌ అన్నాడు.