IND vs NZ 1st ODI:  ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో భారత్ పరాజయం పాలైంది. 306 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచినా దాన్ని కాపాడుకోలేక ఓడిపోయింది. ఈ ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటే ప్రధానంగా బౌలింగ్ వైఫల్యమే కనిపిస్తోంది.


మంచి స్కోరే


ఆక్లాండ్ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. అదీకాక మ్యాచ్ మొదలయ్యే సమయానికి గాలులు, చల్లని వాతావరణం ఉంది. ఇటువంటి పరిస్థితిలో సహజంగానే పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. అందుకే కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలవగానే రెండో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే వారిని మన ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్ లు సమర్ధంగా ఎదుర్కొన్నారు. టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే లాంటి ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని చాలా బాగా ఆడారు. నిదానంగా ఇన్నింగ్స్ ఆరంభించినప్పటికీ కుదురుకున్నాక మంచి షాట్లు ఆడారు. మొదటి వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యం అందించారు. నిజానికి ఫస్ట్ వికెట్ కు ఇంత మంచి పార్ట్ నర్ షిప్ లభించాక ఇంకా భారీ స్కోరు ఆశించవచ్చు. అయితే మధ్య ఓవర్లలో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ధావన్, గిల్, పంత్, సూర్య వికెట్లను త్వరగా తీశారు. అయితే శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ లు బ్యాట్ ఝుళిపించటంతో టీమిండియా మంచి స్కోరే సాధించింది. మ్యాచ్ ముగిశాక కెప్టెన్ ధావన్ కూడా ఇదే చెప్పాడు. డిఫెండ్ చేయగలిగే స్కోరు సాధించామని. అయితేే...


బౌలర్ల వైఫల్యం


ఆసియా కప్ ముందు వరకు గాడిన పడ్డట్లే కనిపించిన భారత బౌలింగ్... ఆ టోర్నీ నుంచి మళ్లీ గతి తప్పినట్లు కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్, ఇప్పుడు కివీస్ తో వన్డే మ్యాచులోనే అది కనిపించింది. న్యూజిలాండ్ ఛేదన ప్రారంభించాక మొదట్లో మన బౌలర్లు వారిని బాగానే ఇబ్బంది పెట్టారు. శార్దూల్ ఠాకూర్, అరంగేట్ర ఆటగాడు ఉమ్రాన్ మాలిక్ లు కచ్చితమైన లెంగ్తుల్లో బంతులు వేశారు. 3 వికెట్లను త్వరగానే పడగొట్టారు. అయితే టామ్ లాథమ్ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతను ఎదురుదాడికి దిగేసరికి టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా 40వ ఓవర్లో టామ్ సృష్టించిన విధ్వంసమే మ్యాచును భారత్ చేతుల్లోంచి లాగేసింది. శార్దూల్ వేసిన ఆ ఓవర్లో లాథమ్ 4 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. దాంతో మ్యాచ్ పూర్తిగా న్యూజిలాండ్ చేతుల్లోకి వెళ్లిపోయింది. అర్షదీప్ కూడా భారీగా పరుగులిచ్చుకున్నాడు.  స్పిన్నర్లూ అంతగా ప్రభావం చూపలేకపోయారు. ప్రధాన స్పిన్నర్ చాహల్ ఒక్క వికెట్ పడగొట్టలేదు. ఎకానమీ దాదాపు 7. వాషింగ్టన్ సుందర్ మాత్రం పొదుపుగా బౌలింగ్ చేశాడు. 


ఫలితంగా కేన్ విలియమ్సన్- టామ్ లాథమ్ లు నాలుగో వికెట్ కు 221 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు. అదీ కేవలం 165 బంతుల్లో. వారిద్దరినీ మన బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ సిరీస్ నుంచి 2023 వన్డే ప్రపంచకప్ నకు సన్నాహకాన్ని ప్రారంభిస్తున్నట్లు మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు కెప్టెన్ శిఖర్ ధావన్ చెప్పాడు. మరిలాంటి బౌలింగ్ దళంతో వచ్చే మ్యాచుల్లో అయినా బౌలింగ్ ను మెరుగుపరచుకుని భారత్ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.