IND Vs NZ, 1st ODI: భారత్ తో జరుగుతున్న మొదటి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. 306 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. టామ్ లాథమ్ మెరుపు ఇన్నింగ్స్ (145) కు తోడు విలియమ్సన్ కెప్టెన్ ఇన్నింగ్స్ (94) తో రాణించటంతో కివీస్ 7 వికెట్ల తేడాతో టీమిండియాపై గెలుపొందింది. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 221 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించారు.
త్వరగానే 3 వికెట్లు
మొదట భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే ఆచితూచి ఆడారు. నెమ్మదిగా ఆడుతూనే మొదటి వికెట్ కు 35 పరుగులు జోడించారు. 8వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ అలెన్ (22) ఔటయ్యాడు. కాన్వేకు జతకలిసిన విలియమ్సన్ నిదానంగా స్కోరు బోర్డును నడిపించాడు. అయితే 16వ ఓవర్లో కాన్వేను (24) అరంగేట్ర బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్ చేర్చాడు. అనంతరం వచ్చిన డారిల్ మిచెల్ (11) ఎక్కువ సేపు నిలవలేదు. ఈ వికెట్ ను ఉమ్రాన్ తన ఖాతాలో వేసుకున్నాడు.
లాథమ్ వీరవిహారం
త్వరగా 3 వికెట్లు పడగొట్టామన్న సంతోషం టీమిండియాకు మిగల్లేదు. ఇంకో వికెట్ తీసి కివీస్ ను ఒత్తిడిలోకి నెడదామనుకున్న భారత్ కు టామ్ లాథమ్ షాక్ ఇచ్చాడు. ఓవైపు కెప్టెన్ కేన్ నిలబడితే.. మరోవైపు టామ్ లాథమ్ వీరవిహారం చేశాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ భారత బౌలింగ్ ను ఊచకోత కోశాడు. కేవలం 76 బంతుల్లోనే శతకం అందుకున్నాడు. సెంచరీ తర్వాత మరింతగా చెలరేగి ఆడాడు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయలేదు. శార్దూల్ వేసిన 40వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో ఆ ఓవర్లో 20 పరుగులు రాబట్టాడు. లాథమ్ బాదుడుకి ధావన్ కి ఎక్కడ ఫీల్డర్ ను పెట్టాలో తెలియలేదు. మరోపక్క క్రీజులో పాతుకుపోయిన విలియమ్సన్ లాథమ్ కి సహకరిస్తూనే వీలైనప్పుడల్లా బౌండరీలు రాబట్టాడు. ఈ క్రమంలోనే అర్థశతకం సాధించాడు. మరో వికెట్ తీసేందుకు టీమిండియా బౌలర్లకు అవకాశమే ఇవ్వకుండా వీరిద్దరే లక్ష్య ఛేదన పూర్తిచేశారు.
బౌలర్లు విలవిలా
కివీస్ ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. 20వ ఓవర్లో 88 పరుగుల వద్ద 3వ వికెట్ పడింది. ఆ తర్వాత ఇంకో వికెట్టే లేదు. దీన్ని బట్టి మన బౌలర్లు ఎంతలా విఫలమయ్యారో అర్ధమవుతోంది. ముఖ్యంగా టామ్ లాథమ్ ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. అర్హదీప్ సింగ్ ఓవర్ కి 8కి పైగానే పరుగులు ఇచ్చుకున్నాడు. మిగతా బౌలర్లూ 6 పైనే రన్స్ ఇచ్చారు. వాషింగ్టన్ సుందర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ పడగొట్టారు.