IND vs NZ 1st ODI: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ 306 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్.. శ్రేయస్ అయ్యర్ అర్ధశతకాలతో మెరిశారు. సంజూ శాంసన్ (36) రాణించాడు. దీంతో భారత్ 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.
ఓపెనర్లు భళా
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఇన్నింగ్స్ కు ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్ లు శతక భాగస్వామ్యం (124) అందించారు. బౌలింగ్ కు అనుకూలించిన పిచ్ పై మొదట ఆచితూచి ఆడిన ఈ జంట కుదురుకున్నాక స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ముఖ్యంగా కెప్టెన్ ధావన్ సాధికారికంగా షాట్లు ఆడాడు. ఈ క్రమంలోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. తర్వాత వేగం పెంచిన ధావన్ 77 పరుగుల వద్ద సౌథీ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. గిల్ కూడా కొన్ని చూడచక్కని షాట్లు కొట్టాడు. 64 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన గిల్ తర్వాతి బంతికే ఔటయ్యాడు. అనంతరం శ్రేయస్ ఆచితూడి ఆడాడు. అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన పంత్ మరోసారి నిరాశపరిచాడు. టీ20 వైఫల్యాన్ని కొనసాగిస్తూ తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. ఫెర్గూసన్ బంతిని సరిగ్గా అంచనా వేయలేక పంత్ (15) బౌల్డయ్యాడు. తర్వాత సూపర్ ఫాంలో ఉన్న సూర్యకుమార్ (4) మొదటి బంతినే బౌండరీకి తరలించాడు. అయితే ఎదుర్కొన్న మూడో బంతికి స్లిప్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా ఫెర్గూసన్ కే దక్కింది.
నిలబెట్టిన శ్రేయస్, సంజూ
160 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత ఇన్నింగ్స్ ను శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ లు నిలబెట్టారు. ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. కొంచెం నిలదొక్కుకున్నాక శ్రేయస్ బౌండరీలు కొట్టాడు. శ్రేయస్ వేగంగా పరుగులు చేస్తుండటంతో సంజూ శాంసన్ అతనికి చక్కని సహకారమందించాడు. సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. వారిద్దరూ ఐదో వికెట్ కు 94 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. 36 పరుగుల వద్ద సంజూ ఔటయ్యాడు. తర్వాత శ్రేయస్ కూడా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. సిక్సులు, ఫోర్లు బాది 16 బంతుల్లోనే 37 పరుగులు చేయటంతో టీమిండియా 300 పరుగుల మార్కుని చేరుకుంది. ఆఖరి ఓవర్లో శార్దూల్ ఠాకూర్ ఔటయ్యాడు.
కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌథీ మూడేసి వికెట్లు తీశారు. ఆడమ్ మిల్నేకు ఒక వికెట్ దక్కింది. మాట్ హెన్రీ వికెట్ తీయనప్పటికీ పొదుపుగా బౌలింగ్ చేశాడు.