Virat Viral Video: భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మంచి ఫుడీ అన్న సంగతి అందరికీ తెలిసిందే. చోలే బటూరే, బటర్ చికెన్ లాంటి వంటకాలంటే తనకు చాలా ఇష్టమని కోహ్లీ పలు కార్యక్రమాల్లో చెప్పాడు. ఇప్పుడంటే ఫిట్ నెస్ ఫ్రీక్ లా మారాడు కాబట్టి క్యాలరీలు చూసుకుని తింటున్నాడు కానీ.. తాను ఫుడీనని కోహ్లీ చెప్పేవాడు. అయితే ఇప్పుడు ఈ ఫుడ్ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా..
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన టీమిండియా ఆసీస్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్, బౌలింగ్ లో సమష్టి ప్రదర్శన చేసిన భారత్ కంగారూలను మట్టికరిపించింది. బౌలింగ్ లో జడేజా మొత్తం 10 వికెట్లు తీశాడు. షమీ, అశ్విన్ కూడా రాణించారు. బ్యాటింగ్ లో అక్షర్ పటేల్, అశ్విన్, పుజారా, కోహ్లీ ఆకట్టుకున్నారు. దీంతో ఆసీస్ పై భారత్ విజయం సాధించింది. సిరీస్ లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
చోలే బటూరేనే అయి ఉంటుంది
ఈ మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ వద్ద ఒక సరదా సన్నివేశం జరిగింది. టీమిండియా బ్యాటింగ్ జరుగుతుండగా విరాట్ కోహ్లీ కోచ్ ద్రవిడ్ తో ఏదో చర్చిస్తుండగా సిబ్బంది ఒకరు ఆహారం తీసుకువచ్చారు. కోహ్లీ దానివైపు చూస్తూ వావ్ అంటూ చప్పట్లు కొట్టడం కనిపించింది. కోహ్లీ హావభావాలు చూసి ఆ వంటకం అతనికి చాలా ఇష్టమైనదానిలా అనిపించింది. అయితే ఆ ఫుడ్ ప్యాకెట్ లో ఏముందో వీడియోలో కనిపించలేదు.
ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు, ఫ్యాన్స్ తమకు నచ్చిన కామెంట్లు పెడుతున్నారు. 'అది కోహ్లీకి ఇష్టమైన చోలే బటూరే లా అయి ఉంటుందని' ఒకరు కామెంట్ చేశారు. 'ఢిల్లీ, చోలే బటూర్, ఒక ప్రేమకథ' అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా దీనిపై స్పందిస్తూ.. 'రామా చోలే బటూరే నుంచి ఆర్డర్ వస్తే రియాక్షన్ ఇలానే ఉంటుంది' అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్
వరుసగా రెండో టెస్టులోనూ విజయం సాధించిన భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దాదాపు దూసుకెళ్లినట్లే. ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్ తన నంబర్ టూ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పుడు టీం ఇండియా కూడా టైటిల్ మ్యాచ్‌కు చేరుకోవడం ఖాయం.
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తాజా పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్ 64.06 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 66.67 పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఈ జట్లతో పాటు శ్రీలంక 53.33 పాయింట్లతో మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా 48.72 పాయింట్లతో నాలుగో స్థానంలో, వెస్టిండీస్ 40.91 పాయింట్లతో ఆరో స్థానంలో, పాకిస్థాన్ 38.1 పాయింట్లతో ఏడో స్థానంలో, న్యూజిలాండ్ 27.27 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో, బంగ్లాదేశ్ 11.11 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాయి.