IND vs AUS 2nd Test: అద్భతాలు జరగలేదు. అంచనాలు మారలేదు. ఫలితం తారుమారు కాలేదు. సొంతగడ్డపై భారత్ ను ఓడించడం ఎంత కష్టమో మరోసారి నిరూపిస్తూ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. రవీంద్ర జడేజా సూపర్ స్పెల్ కు రోహిత్, పుజారా, కోహ్లీ, శ్రీకర్ భరత్ ల సమయోచిత బ్యాటింగ్ తోడైన వేళ టీమిండియా కంగూరూలను మట్టికరిపించింది. 


రెండోరోజు ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియాను మూడోరోజు లంచ్ లోపే ఆలౌట్ చేయడం దగ్గరే భారత్ విజయానికి పునాది పడింది. రెండో రోజు చివరి సెషన్ లో దూకుడుగా ఆడి భారత్ ను ఆత్మరక్షణలో పడేసిన ఆసీస్ బ్యాటర్లు.. మూడో రోజుకొచ్చేసరికి తేలిపోయారు. అశ్విన్, జడేజాల ధాటికి ఒక్క సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా జడ్డూ తన బౌలింగ్ తో కంగారూలకు కంగారు పుట్టించాడు. క్రీజులో బ్యాటర్లను నిలవనీయకుండా చేశాడు. మరోవైపు అశ్విన్ చక్కని సహకారం అందించాడు. వీరి స్పిన్ మాయాజాలానికి 52 పరుగులకే ఆసీస్ చివరి 9 వికెట్లను కోల్పోయింది. 


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఛేదనలో రోహిత్ శర్మ (20 బంతుల్లో 31), విరాట్ కోహ్లీ (31 బంతుల్లో 20), ఛతేశ్వర్ పుజారా (74 బంతుల్లో 31 నాటౌట్), శ్రీకర్ భరత్ (22 బంతుల్లో 23 నాటౌట్) రాణించారు. అంతకుముందు రవీంద్ర జడేజా (7 వికెట్లు), అశ్విన్ (3) లు చెలరేగటంతో రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 113 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో సిరీస్ లో టీమిండియా 2-0 ఆధిక్యం సాధించింది. 






జడేజా 7, అశ్విన్ 3


రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా చుక్కలు చూపించారు. ఈ జంట మూడో రోజు కంగారూలను కంగారు పెట్టించారు. ఓవైపు అశ్విన్ బంతిని గింగిరాలు తిప్పుతూ ఆసీస్ బ్యాటర్లను చుట్టేస్తే.. మరోవైపు జడ్డూ నేరుగా వికెట్లకు గురిపెట్టాడు. వీరి ధాటికి వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్ చేరారు. ఒక్కరూ నిలబడలేదు. ఒక వికెట్ నష్టానికి 61 పరుగులతో మూడో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ ను జడేజా, అశ్విన్ లు నిలబడనీయలేదు. దూకుడుగా ఆడుతున్న ట్రావెస్ హెడ్ (46 బంతుల్లో 43)ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ వికెట్ల వేటను మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. జడ్డూ, యాష్ లు పోటీపడి వికెట్లు పడగొట్టారు. స్మిత్ (19 బంతుల్లో 9), రెన్ షా (2), హ్యాండ్స్ కాంబ్ (0), కమిన్స్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు.  స్వీప్ షాట్లతో భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్న కంగారూ జట్టు ఆలోచన బెడిసి కొట్టింది. అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ లాంటి ఆసీస్ బ్యాటర్లు రాంగ్ షాట్ సెలక్షన్ తో వికెట్లు పోగొట్టుకున్నారు. జడేజా 7 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 


రాణించిన అక్షర్, అశ్విన్


అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైంది. ఖవాజా (81), హ్యాండ్స్ కాంబ్ (72), కమిన్స్ (33) రాణించారు. మహమ్మద్ షమీ 4 వికెట్లు తీయగా.. అశ్విన్, జడేజాలు చెరో 3 వికెట్లు పడగొట్టారు. బదులుగా భారత్ తొలి ఇన్నింగ్స్ లో 262 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియాకు ఒక పరుగు ఆధిక్యం మాత్రమే లభించింది. ఒక దశలో 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను అక్షర్ పటేల్ ((74) ఆదుకున్నాడు, కోహ్లీ (44), అశ్విన్ (37) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్ 5 వికెట్లతో మెరిశాడు. కున్హేమాన్, టాడ్ మర్ఫీలు చెరో 2 వికెట్లు తీశారు. 


రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ లో మొత్తం 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 6 నెలలు మైదానానికి దూరంగా ఉన్న జడేజా పునరాగమనంలో అదరగొడుతున్నాడు. 


కోహ్లీ @ 25,000


భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి వేగంగా 25వేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.