IND vs AUS 2nd Test:  భారత్- ఆస్ట్రేలియా రెండో టెస్ట్.. ఓవైపు రెండో రోజు మ్యాచ్ లో ఆధిపత్యం ప్రదర్శించింది ఆసీస్ జట్టు. మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యం దక్కకపోయినా.. రెండో ఇన్నింగ్స్ ను దూకుడుగా మొదలు పెట్టి టీమిండియాపై ఒత్తిడి పెంచింది. రెండో రోజు ఆఖరి ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేసి భారత బౌలర్లను ఆత్మరక్షణలోకి నెట్టేసింది. మరోవైపు విజయ లక్ష్యం 150 పరుగులు దాటితే గెలుపు కష్టమనే అంచనాలు. 200లు అయితే విజయంపై ఆశలు వదిలేసుకోవాల్సిందే అన్న మాటలు.  ఆతిథ్య జట్టు బ్యాటర్ల జోరు చూస్తే మూడో రోజు భారీ స్కోరు సాధించేలా కనిపించింది. అయితే...


జడేజా 7, అశ్విన్ 3


భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజా తమ స్పిన్ మాయాజాలాన్ని చూపించారు. ఈ జంట మూడో రోజు కంగారూలను కంగారు పెట్టించారు. ఓవైపు అశ్విన్ బంతిని గింగిరాలు తిప్పుతూ ఆసీస్ బ్యాటర్లను చుట్టేస్తే.. మరోవైపు జడ్డూ నేరుగా వికెట్లకు గురిపెట్టాడు. వీరి ధాటికి వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్ చేరారు. ఒక్కరూ నిలబడలేదు. వీరిద్దరూ వికెట్ల వేటలో పోటీపడటంతో టీమిండియా విజయంపై కన్నేసింది. 


ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టుబిగించింది.  రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ ను 113 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో భారత్ ముందు 115 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. మూడోరోజు ఆస్ట్రేలియా జట్టు కనీసం లంచ్ వరకైనా నిలవలేదు. ఆ జట్టు సెషన్ లో 52 పరుగులు చేసి మిగిలిన 9 వికెట్లు కోల్పోయింది.






తిప్పేశారు


ఒక వికెట్ నష్టానికి 61 పరుగులతో మూడో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్ ను జడేజా, అశ్విన్ లు నిలబడనీయలేదు. దూకుడుగా ఆడుతున్న ట్రావెస్ హెడ్ (46 బంతుల్లో 43)ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ వికెట్ల వేటను మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. జడ్డూ, యాష్ లు పోటీపడి వికెట్లు పడగొట్టారు. స్మిత్ (19 బంతుల్లో 9), రెన్ షా (2), హ్యాండ్స్ కాంబ్ (0), కమిన్స్ (0) ఇలా వచ్చి అలా వెళ్లారు.  స్వీప్ షాట్లతో భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్న కంగారూ జట్టు ఆలోచన బెడిసి కొట్టింది. అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ లాంటి ఆసీస్ బ్యాటర్లు రాంగ్ షాట్ సెలక్షన్ తో వికెట్లు పోగొట్టుకున్నారు. జడేజా 7 వికెట్లతో చెలరేగగా.. అశ్విన్ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 


ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే భారత్ 115 పరుగులు సాధించాలి.