భారత్‌తో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేసింది.  ఇంగ్లండ్ తరఫున పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నటాలీ స్కీవర్ (50: 42 బంతుల్లో, ఐదు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించింది.


భారత్ తరఫున స్మృతి మంథన (52: 41 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. చివర్లో రిచా ఘోష్ (47 నాటౌట్: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) సిక్సర్లతో చెలరేగినా విజయానికి అది సరిపోలేదు. భారత బౌలర్లలో రేణుకా సింగ్ నాలుగు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీయడం విశేషం.


ఈ మ్యాచ్ ఓటమితో తర్వాత ఐర్లాండ్‌తో ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా వీలైనంత భారీ తేడాతో విజయం సాధించాలి. ఎందుకంటే గ్రూప్-బిలో టాప్‌లో నిలిచిన ఇంగ్లండ్ దాదాపుగా సెమీస్‌కు అర్హత సాధించినట్లే. ఇంగ్లండ్ తన చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో పాక్ విజయం సాధిస్తే నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. కాబట్టి భారత్ తన తర్వాతి మ్యాచ్‌ను వీలైనంత భారీ తేడాతో గెలవాలి.


152 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు నాలుగో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ షెఫాలీ వర్మ (8: 11 బంతుల్లో, ఒక ఫోర్) భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయింది. ఆ తర్వాత వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (13: 16 బంతుల్లో) కూడా వేగంగా ఆడలేకపోయింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (4: 6 బంతుల్లో) కూడా వెంటనే అవుటై పెవిలియన్ బాట పట్టింది. అప్పటికి స్కోరు 62 పరుగులు మాత్రమే.


ఈ దశలో మరో ఓపెనర్ స్మృతి మంధానకు (52: 41 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ (47 నాటౌట్: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు) తోడయింది. వీరు క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ భారత్ విజయంపై ఆశలు కోల్పోలేదు. సిక్సర్‌తో అర్థ సెంచరీ సాధించిన స్మృతి మంధాన తర్వాతి బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయింది. అనంతరం దీప్తి శర్మ (7: 9 బంతుల్లో),  పూజా వస్త్రాకర్ (2 నాటౌట్: 4 బంతుల్లో) కీలక సమయంలో రిచా ఘోష్‌కు స్ట్రైక్ ఇవ్వడంలో విఫలం అయ్యారు.


అత్యంత కీలకమైన 19వ ఓవర్లో పూజా మూడు బంతులు ఆడి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేయగలిగింది. దీంతో మరో ఎండ్‌లో రిచాపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరి ఓవర్లో భారత్ విజయానికి 31 పరుగులు అవసరం అయ్యాయి. రిచా ఎంత పోరాడినా అది ఓటమి తేడాను మాత్రమే తగ్గించగలిగింది. దీంతో 20 ఓవర్లలో భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది.


టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే మొదటి ఓవర్ లోనే ఇంగ్లండ్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఓపెనర్ డేనియల్లీ వ్యాట్ (0: 1 బంతి) తను ఆడిన మొదటి బంతికే అవుట్ అయింది. మరో ఓపెనర్ సోఫియా డంక్లే (10: 11 బంతుల్లో, ఒక ఫోర్), వన్ డౌన్ బ్యాటర్ ఆలిస్ క్యాప్సే (3: 6 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో ఇంగ్లండ్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లే ముగిసే లోపే టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ బాట పట్టింది.


అయితే అసలు ఆట ఆ తర్వాతనే మొదలైంది. టూ డౌన్‌లో వచ్చిన నటాలీ స్కీవర్ (50: 42 బంతుల్లో, ఐదు ఫోర్లు), కెప్టెన్ హీథర్ నైట్ (28: 23 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 38 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. ఈ దశలో హీథర్ నైట్ అవుటైనా, తన తర్వాత వచ్చిన అమీ జోన్స్ (40: 27 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) వేగంగా ఆడింది. దీంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ ఐదు వికెట్లు తీసుకోగా, శిఖా పాండే, దీప్తి శర్మలకు చెరో వికెట్ దక్కించుకున్నారు.