Konaseema Crime : బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సంచనలం అయిన బాలికపై సామూహిక అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల అరెస్ట్ చేశారు. నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామంలో ఈ నెల 6న బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 16న బాధిత బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ మాధవ రెడ్డి, ముమ్మిడివరం సీఐ జానకిరామ్ ఈ కేసుపై విచారణ చేపట్టారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులు ఓలేటి బ్రహ్మతేజ(20), ఓలేటి తులసీరావు(21), ఓలేటి ధర్మారావు(21), మాల్లాడి వంశీ(20), అర్ధాని వీరబాబు(21) అరెస్ట్ చేసి, ముమ్మిడివరం కోర్టులో హాజరుపర్చారు. నిందితులకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది.
అసలేం జరిగిందంటే..?
కామంతో కళ్లు మూసుకుపోయిన కామంధులు బరితెగిస్తున్నారు. మాయ మాటలు చెప్పిన ఓ బాలికను నిర్మానుస్య ప్రాంతానికి తీసుకెళ్లిన ఐదుగురు దుండగులు.. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితును అరెస్ట్ చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.
లక్ష పరిహారం ఇస్తామని బెదిరింపులు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలిక.. ఈనెల 6వ తేదీన బట్టలు ఉతికేందుకు తీరప్రాంతంలో ఉన్న సరుగుడు తోటల మధ్యకు వెళ్లింది. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఐదుగురు యువకులు ఆమె వెంటే వెళ్లారు. సదరు బాలికతో మాట కలిపారు. మాయ మాటలు చెప్పి పక్కనే ఉన్న గుబురు పొదల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఐదుగురూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారంతా పారిపోయారు. తీవ్ర అస్వస్థతతకు గురైన బాలిక ముక్కుతూ, మూలుగుతూ చాలా కష్టంగా ఇంటికి చేరుకుంది. అయితే బాలిక అలా ఉండడంతో ఏమైందని ప్రశ్నించిన తల్లిదండ్రులకు అసలు విషయాన్ని తెలిపింది. అయితే అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు యువకులు అధికార పార్టీకి చెందిన నాయకుల కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దారుణానికి ఒడిగట్టిన నిందితులు బాధిత కుటుంబాన్ని బెదిరించడం మొదలు పెట్టారు.
తమ కూతురు జీవితాన్ని నాశనం చేసిన వారిని ఎలాగైనా శిక్షించాలని తల్లిదండ్రులు గ్రామ పెద్దలను కలిసి విషయం తెలిపారు. పంచాయితీ పెట్టించారు. అయితే లక్ష రూపాయలు ఇస్తాం విషయం మర్చిపోమ్మని నిందితుల తల్లిదండ్రులు చెప్పగా.. అందుకు బాలిక కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇక వీళ్లకు చెప్పి లాభం లేదనుకొని బాధిత కుటుంబ సభ్యులు.. పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే గురువారం డీఎస్పీ వై.మాధవ రెడ్డి సిబ్బందితో వెళ్లి విచారణ చేపట్టారు. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు సర్పంచ్ కుమారుడు ఓలేటి తేజ, ఓలేటి తులసిరావు (తులసి), మల్లాడి వంశీ, ఓలేటి ధర్మరాజు, అర్థాని సత్తిపండులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు కాట్రేని కోన ఎస్ఐ పి.శ్రీనివాస్ తెలిపారు.