Talibans Attrocity on Woman:
11 మందికి శిక్ష..
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన వచ్చినప్పటి నుంచి అక్కడి మహిళలు నరకం చూస్తున్నారు. వాళ్లపై ఆంక్షలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళలకు స్వేచ్ఛ లేకుండా కట్టడి చేస్తున్నారు. షరియా చట్టాన్ని అమలు చేస్తూ...కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి బదక్షన్ ప్రావిన్స్‌లో జరిగింది. ఫైజాబాద్‌లోని ఓ గ్రౌండ్‌లో 11 మందిని ప్రజలందరూ చూస్తుండగానే దారుణంగా కొట్టినట్టు తాలిబన్ సుప్రీం కోర్టు వెల్లడించింది. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, చట్టానికి వ్యతిరేకంగా నడుచుకున్నారన్న ఆగ్రహంతో బహిరంగంగానే తాలిబన్లు వాళ్లను విచక్షణా రహితంగా కొట్టారు. అంతకు ముందు 16 మందిని కూడా ఇదే కారణంతో కొట్టినట్టు సుప్రీం కోర్టు తెలిపింది. నిజానికి...అక్కడ ఇలా శిక్ష విధించడం చాలా సాధారణమైపోయింది. ఏ తప్పు చేసినా సరే...నేరుగా వీధుల్లోకి తీసుకొచ్చి అందరి ముందు శిక్ష విధిస్తారు. ఇప్పటి వరకూ రకరకాల నేరాలు చేశారన్న కారణంగా 250 మందిని ఇలా కొట్టినట్టు అక్కడి మీడియా వెల్లడించింది. తాలిబన్ల ప్రభుత్వంపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నా...వాళ్లు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. షరియా చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. గతేడాది నవంబర్ నుంచి శిక్షల తీవ్రత పెంచుతూ వస్తున్నారు. గత నెల పలు ప్రావిన్స్‌లలో వందలాది మందిని ఇలా ఆరుబయటే కొట్టినట్టు స్థానికి మీడియా తెలిపింది.
చట్టమే ముఖ్యం..
అఫ్గనిస్థాన్‌లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి మహిళా హక్కుల్ని పూర్తిగా అణిచివేస్తున్నారు. ముఖ్యంగా వాళ్లు చదువుకోకుండా అడ్డుకుంటోంది తాలిబన్ ప్రభుత్వం. యూనివర్సిటీ విద్యపై ఇటీవలే నిషేధం విధించింది. స్వచ్ఛంద సంస్థల్లోనూ పని చేయకూడదని తేల్చి చెప్పింది. ఈ నిర్ణయాలపై అంతర్జాతీయంగా విమర్శలు వస్తున్నాయి. అయినా...తాలిబన్‌లు మాత్రం ఇవేవీ లెక్క చేయడం లేదు. పైగా...దీని గురించి మాట్లాడటానికీ ఆసక్తి చూపించడం లేదు. "మహిళలపై ఆంక్షల్ని తొలగించాలనే విషయం అసలు మా ప్రియారిటీ కానే కాదు" అని తాలిబన్ ప్రతినిధి ఒకరు చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి.
"మహిళల హక్కులు అనేది మా ప్రియారిటీ కాదు. ఇస్లామిక్ లా కి వ్యతిరేకంగా ఉండే దేన్నైనా మేం సహించం. ప్రస్తుతం దేశంలో ఏ నిబంధనలైతే ఉన్నాయో..వాటికి అనుగుణంగానే నడుచుకుంటున్నాం"
- తాలిబన్ ప్రతినిధి
ఇప్పటికే మహిళల చదువులపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నారు తాలిబన్లు. ఎన్‌జీవోల్లోనూ పని చేయకూడదన్న రూల్ తీసుకొచ్చాక మహిళల నిరసనలు తీవ్రమయ్యాయి. చాలా యూనివర్సిటీల ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. అమెరికా, యూకే, జర్మనీ, ఈయూ సహా పలు దేశాలు తాలిబన్ల నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ ఆంక్షలన్నీ ఎత్తివేసి మహిళలు చదువుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం...అఫ్గాన్‌లో బాలికలు సెకండరీ ఎడ్యుకేషన్ కొనసాగించకపోవడం వల్ల దేశ జీడీపీ 2.5% మేర పడిపోయింది. కేవలం 12 నెలల్లోనే 500 మిలియన్ డాలర్ల మేర కోల్పోయింది. అయితే...తాలిబన్లు మాత్రం "మతపరమైన విధానాలను ఓ సారి గమనించండి. అనవసరమైన రచ్చ చేయకండి" అంటూ ఆయా దేశాలకు వివరణ ఇస్తున్నాయి. ఇప్పటికే 11 దేశాలు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టాయి.