Sandeep Lamichane:  నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే... కొన్ని నెలల క్రితం ఇతని పేరు బాగా చర్చల్లో నలిగింది. 22 ఏళ్ల ఈ క్రికెటర్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంది. అయితే అది అతని ఆటను చూసి కాదు.. అతనిపై వచ్చిన ఆరోపణల వలన సందీప్ గురించి అందరూ చర్చించుకున్నారు. మరోసారి ఈ నేపాల్ యువ క్రికెటర్ వార్తల్లో నిలిచాడు. ఎందుకంటే..


నేపాల్‌ మాజీ కెప్టెన్‌ సందీప్ లమిచానే గతేడాది అత్యాచార ఆరోపణలతో అరెస్టయ్యాడు. దీంతో అతడిపై నేపాల్ క్రికెట్ బోర్డు నిషేధం విధించింది. కొన్నాళ్ల క్రితం సందీప్ బెయిల్ పై విడుదలై బయటకు వచ్చాడు. న్యాయస్థానం ఆదేశాల మేరకు నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సందీప్ పై నిషేధం ఎత్తివేసి మళ్లీ జట్టులో చోటిచ్చింది. అయితే కెప్టెన్ గా కాదు ఆటగాడిగా జట్టులో ఉన్నాడు. 


ఇప్పుడేం జరిగిందంటే..


ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్ లీగ్‌-2లో భాగంగా స్కాట్లాండ్‌, నమీబియా క్రికెట్ జట్లు నేపాల్‌ పర్యటనకు వచ్చాయి. ఈ 3 జట్ల మధ్య ముక్కోణపు వన్డే సిరీస్‌ జరగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఆతిథ్య నేపాల్‌- పర్యాటక స్కాట్లాండ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన నేపాల్‌ బౌలింగ్‌ ఎంచుకోగా.. స్కాట్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. 275 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ 47 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీపేంద్రసింగ్ (85), కుశాల్ మల్ల (81) పరుగులతో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. 


సందీప్ తో కరచాలనానికి నో


మ్యాచ్ ముగిశాక ఇరు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకోవడం పరిపాటి. అయితే నేపాల్ జట్టును అభినందించే క్రమంలో స్కాట్లాండ్ ఆటగాళ్లు సందీప్ లమిచానేతో చేయి కలపడానికి నిరాకరించారు. మిగతా జట్టు సభ్యులందరితో కరచాలనం చేసిన స్కాట్లాండ్ ప్లేయర్లు.. సందీప్ కు మాత్రం హ్యాండ్ షేక్ ఇవ్వలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 


నమీబియా కూడా


అంతకుముందు నమీబియా ఆటగాళ్లు కూడా సందీప్‌ పట్ల ఇలాగే వ్యవహరించారు. నేపాల్‌ బోర్డు సెలక్షన్‌తో తమకు పనిలేదని, అయితే, మహిళలపై హింసకు వ్యతిరేకంగా తమ స్పందన తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కాట్లాండ్, నమీబియా బోర్డులు తెలిపాయి.  ఈ విషయాన్ని సందీప్‌నకు నేపాల్‌ బోర్డు ముందే చెప్పడంతో అతడు కూడా వారికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 


ఇకపోతే ఈ మ్యాచ్ లో సందీప్ లమిచానే అద్భుత ప్రదర్శన చేసాడు.  22 ఏళ్ల ఈ యువ బౌలర్‌ 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జట్టులో అందరికంటే మెరుగైన ప్రదర్శన (ఎకానమీ 2.70) కనబరిచాడు.