IND vs AUS 2nd test: ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకు భారత బ్యాటర్లు తడబడ్డారు. వికెట్ నష్టపోకుండా 21 పరుగులకు రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. లంచ్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. నాథన్ లియాన్ (4 వికెట్లు) స్పిన్ కు విలవిల్లాడిన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. 


4 వికెట్లు లియాన్ ఖాతాలోకే


వికెట్ నష్టపోకుండా 21 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు నెమ్మదిగా నడిపించారు. జట్టు ఓవర్ నైట్ స్కోరుకు వీరిద్దరూ మరో 25 పరుగులు జోడించారు. అయితే క్రీజులో కుదురుకోడానికి ప్రయత్నిస్తున్న కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 17)ను నాథన్ లియాన్ ఎల్బీగా వెనక్కు పంపాడు. ఇక అక్కడనుంచి వచ్చిన బ్యాటర్ల వచ్చినట్లే పెవిలియన్ చేరాడు. ఒక చక్కని బంతితో నిలకడగా ఆడుతున్న రోహిత్ (69 బంతుల్లో 32) ను లియాన్ బౌల్డ్ చేశాడు.  ఆ తర్వాత రెండో బంతికే వందో టెస్ట్ ఆడుతున్న పుజారా లియాన్ కే వికెట్ల ముందు దొరికిపోయాడు. మైలురాయి లాంటి మ్యాచ్ లో పుజారా డకౌట్ గా వెనుదిరిగాడు. 


విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. క్రీజులో సౌకర్యంగా కదిలిన కోహ్లీ సింగిల్స్, అప్పుడప్పుడు బౌండరీలతో స్కోరు బోర్డును నడిపించాడు. గాయంతో తొలి టెస్టుకు దూరమై ఈ మ్యాచ్ లో జట్టులోకి వచ్చిన శ్రేయస్ (15 బంతుల్లో 4) బాగానే ఆరంభించినప్పటికీ ఎక్కువసేపు ఆడలేకపోయాడు. షార్ట్ లెగ్ లో హ్యాండ్స్ కాంబ్ పట్టిన షార్ప్ క్యాచ్ కు ఔటయ్యాడు. ఈ వికెట్ కూడా లియాన్ ఖాతాలోకే చేరింది. 






కోహ్లీ, జడేజాల పోరాటం


శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే పనిలో పడ్డాడు. అప్పుడప్పుడు బంతులు ఎడ్జ్ తీసుకుంటూ పరీక్షిస్తున్నా వీరిద్దరూ పట్టుదలగా నిలబడ్డారు. ఈ జంట లంచ్ సమయానికి ఐదో వికెట్ కు 22 పరుగులు జోడించింది. ప్రస్తుతం కోహ్లీ (42 బంతుల్లో 14), జడేజా (36 బంతుల్లో 15) క్రీజులో ఉన్నారు. ఇంకా భారత్ 175 పరుగులు వెనకబడి ఉంది. 


అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజా (81; 125 బంతుల్లో 12x4, 1x6), పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ (72 నాటౌట్‌; 142 బంతుల్లో 9x4) రాణించారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.