South Africa Test Captain: దక్షిణాఫ్రికా టెస్ట్ కెప్టెన్సీ చేతులు మారింది. ఆ జట్టు సుదీర్ఘ ఫార్మాట్ కెప్టెన్ డీన్ ఎల్గర్ నుంచి టెంబా బవుమా పగ్గాలు అందుకున్నాడు. వరుస పరాజయాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు టెస్ట్ కెప్టెన్సీ నుంచి డీన్ ఎల్గర్ ను తప్పించింది. అయితే ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్ గా ఉన్న బవుమా పొట్టి ఫార్మాట్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. కేవలం టెస్టులు, వన్డేలకు మాత్రమే నాయకుడిగా వ్యవహరించనున్నాడు.
తొలి నల్లజాతీయుడిగా రికార్డ్
సఫారీ జట్టు టెస్ట్ కెప్టెన్సీ దక్కించుకున్న టెంబా బవుమా కొత్త రికార్డును సృష్టించాడు. రెడ్ బాల్ క్రికెట్ లో దక్షిణాఫ్రికాకు నాయకత్వం వహించనున్న తొలి నల్ల జాతీయుడిగా బవుమా నిలిచాడు. అలాగే సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ గా అయిడెన్ మార్ క్రమ్ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక ఎల్గర్ ఇప్పటివరకు 17 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు. అందులో 9 విజయాలు, 7 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి.
వరుస పరాజయాలతో కీలక నిర్ణయం
విజయాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇటీవల ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సిరీస్ లలో దక్షిణాఫ్రికా ఓటమి పాలవటంతో సఫారీ సెలక్టర్లు కెప్టెన్ గా అతనిపై వేటు వేశారు. ఈ 2 సిరీసుల్లోనూ బ్యాటర్ గా, కెప్టెన్ గా ఎల్గర్ విఫలమయ్యాడు. అందుకే స్వదేశంలో వెస్టిండీస్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన సెలక్షన్ కమిటీ బవుమాను కెప్టెన్ గా ఎంపికచేసింది. అయితే డీన్ ఎల్గర్ ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు. ఫిబ్రవరి 28 నుంచి సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా- వెస్టిండీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది.
విండీస్ తో టెస్టులకు దక్షిణాఫ్రికా జట్టు
టెంబా బవుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్, సైమన్ హార్మర్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, అయిడెన్ మార్ క్రమ్, వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుస్వామి, అన్రిచ్ నోర్ట్జే, కీగన్ పీటర్సన్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్.