David Warner Ruled Out:  బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. శుక్రవారం ఈ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ టెస్టులో ఆతిథ్య జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా రెండో టెస్ట్ మిగిలిన రోజులకు దూరమయ్యాడు. తొలి రోజు బ్యాటింగ్ చేసిన వార్నర్ మిగతా మ్యాచ్ కు అందుబాటులో ఉండడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ట


ప్రస్తుతం డేవిడ్ వార్నర్ పేలవ ఫాంలో ఉన్నాడు. తొలి టెస్టులో నిరాశపరిచిన డేవిడ్ రెండో టెస్టులోనూ ఆకట్టుకోలేకపోయాడు. 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే తొలి రోజు బ్యాటింగ్ సమయంలో ఈ ఆసీస్ ఓపెనర్ గాయపడ్డాడు. మహమ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్లకు వార్నర్ కు గాయమైంది. తొలుత సిరాజ్ విసిరిన ఓ బంతి వార్నర్ మోచేతికి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన అతను.. ఫిజియోల సాయంతో బ్యాటింగ్ ను కొనసాగించాడు. అయితే సిరాజ్ బౌన్సర్లకు వార్నర్ మళ్లీ మళ్లీ ఇబ్బందిపడ్డాడు. వరుసగా రెండు బంతులు డేవిడ్ వార్నర్ హెల్మెట్ ను బలంగా తాకాయి. ఫిజియో వచ్చి కంకషన్ టెస్ట్ నిర్వహించారు. తర్వాత కొద్దిసేపటికే వార్నర్ అవుటయ్యాడు. 


డ్రెస్సింగ్ రూంకు వెళ్లిన వార్నర్ నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది. భారత్ బ్యాటింగ్ సమయంలో అతను ఫీల్డింగ్ కు రాలేదు. ఇక వార్నర్ మిగతా టెస్టుకు దూరమైనట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. వార్నర్ స్థానంలో కంకషన్ సబ్ స్టిట్యూట్ గా మాథ్యూ రెన్ షా జట్టులోకి వచ్చాడు. 


లియాన్ దెబ్బకు భారత్ విలవిల


ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ దెబ్బకు భారత బ్యాటర్లు తడబడ్డారు. వికెట్ నష్టపోకుండా 21 పరుగులకు రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. లంచ్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. నాథన్ లియాన్ (4 వికెట్లు) స్పిన్ కు విలవిల్లాడిన బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. స్వల్ప వ్యవధిలో వరుస వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. 


4 వికెట్లు లియాన్ ఖాతాలోకే


వికెట్ నష్టపోకుండా 21 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు నెమ్మదిగా నడిపించారు. జట్టు ఓవర్ నైట్ స్కోరుకు వీరిద్దరూ మరో 25 పరుగులు జోడించారు. అయితే క్రీజులో కుదురుకోడానికి ప్రయత్నిస్తున్న కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 17)ను నాథన్ లియాన్ ఎల్బీగా వెనక్కు పంపాడు. ఇక అక్కడనుంచి వచ్చిన బ్యాటర్ల వచ్చినట్లే పెవిలియన్ చేరాడు. ఒక చక్కని బంతితో నిలకడగా ఆడుతున్న రోహిత్ (69 బంతుల్లో 32) ను లియాన్ బౌల్డ్ చేశాడు.  ఆ తర్వాత రెండో బంతికే వందో టెస్ట్ ఆడుతున్న పుజారా లియాన్ కే వికెట్ల ముందు దొరికిపోయాడు. మైలురాయి లాంటి మ్యాచ్ లో పుజారా డకౌట్ గా వెనుదిరిగాడు. శ్రేయర్ అయ్యర్ వికెట్ కూడా లియాన్ కే దక్కింది. 


ఆసీస్ 263 ఆలౌట్


అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖవాజా (81; 125 బంతుల్లో 12x4, 1x6), పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ (72 నాటౌట్‌; 142 బంతుల్లో 9x4) రాణించారు. భారత బౌలర్లలో షమీ 4 వికెట్లతో ఆకట్టుకున్నాడు.