IND vs AUS 2nd Test:  భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్నరెండో టెస్టులో రెండో రోజు ఆట రెండు సెషన్లలో ఆధిపత్యం ప్రదర్శించింది. ఆసీస్ స్పిన్నర్లు విజృంభించటంతో భారత్ ఒక దశలో 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో భారత స్టార్ విరాట్ కోహ్లీ ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. 


రెండో టెస్ట్ రెండో రోజు సహచర బ్యాటర్లు విఫలమవుతున్నా విరాట్ కోహ్లీ 44 పరుగులతో రాణించాడు. కంగారూ స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. అయితే ఆసీస్ అరంగేట్రం స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్ బౌలింగ్ లో వివాదాస్పద రీతిలో అవుటయ్యాడు. కోహ్లీ 44 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాథ్యూ విసిరిన బంతి అతని ప్యాడ్లను తాకింది. ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ వెంటనే ఔటిచ్చాడు. అయితే తాను ఔట్ కాదని నమ్మకంగా ఉన్న కోహ్లీ డీఆర్ ఎస్ కు వెళ్లాడు. థర్డ్ అంపైర్ చాలాసేపు దాన్ని పరిశీలించాడు. బంతి ముందుగా బ్యాట్ ను తాకిందా.. లేదా ప్యాడ్ లను తాకిందా అనేదానిపై స్పష్టత కొరవడింది. రీప్లేలు అసంపూర్తిగా ఉండటంతో థర్డ్ అంపైర్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని నిర్ణయించాడు. దాంతో కోహ్లీ నిరాశగా వెనుదిరిగాడు. 


డ్రెస్సింగ్ రూంకు వచ్చాక కోహ్లీ స్క్రీన్లపై రీప్లేలను చూసి అసహనానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 






రెండో సెషన్ ఆసీస్ దే


భారత్ తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి సెషన్ లో టీమిండియాపై సంపూర్ణ మెజారిటీ కనబర్చిన ఆసీస్ జట్టు.. లంచ్ తర్వాతా అదే కొనసాగించింది. లంచ్ కు ముందు 4 వికెట్లు పడగొట్టిన కంగారూలు.. రెండో సెషన్ లో మరో 3 వికెట్లు తీశారు. దీంతో టీ బ్రేక్ వరకు టీమిండియా 7 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. 


4 వికెట్లకు 88 పరుగులతో లంచ్ కు వెళ్లిన భారత జట్టు.. లంచ్ తర్వాతా తడబడింది. లంచ్ తర్వాత జడేజా, కోహ్లీలు బాగానే ఆడారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. అయితే ఐదో వికెట్ కు 59 పరుగులు జోడించాక మర్ఫీ బౌలింగ్ లో జడేజా (74 బంతుల్లో 26) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత 2 ఓవర్లకే కుదురుకుని ఆడుతున్న కోహ్లీని (84 బంతుల్లో 44) అరంగేట్ర బౌలర్ కున్హేమన్ ఎల్బీగా వెనక్కు పంపాడు. శ్రీకర్ భరత్ (12 బంతుల్లో 6) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఈ వికెట్ తో లియాన్ 5 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత్ 139 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.  అయితే భారత్ లోయరార్డర్ పవర్ ను చూపిస్తూ అశ్విన్, అక్షర్ లు నిలబడ్డారు. కుప్పకూలేలా కనిపించిన టీమిండియాను కొంతమేరకు గాడిలో పడేశారు. ఈ జోడీ కుదురుకోవటంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 7 వికెట్లకు 179 పరుగులతో నిలిచింది. అయినప్పటికీ ఇంకా 84 పరుగులు వెనకబడే ఉంది.