Ranji Trophy Final: 2022- 23 రంజీ ట్రోఫీని సౌరాష్ట్ర జట్టు గెలుచుకుంది. చివరిగా 2019- 20లో ఈ కప్పును గెలుచుకున్న సౌరాష్ట్ర ఇప్పుడు మరోసారి ట్రోఫీని ముద్దాడింది. అప్పుడు, ఇప్పుడు ఫైనల్ లో బెంగాల్ నే ఆ జట్టు ఓడించింది. 9 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర బెంగాల్ పై విజయం సాధించింది. మొత్తంగా నాలుగోసారి రంజీ ట్రోఫీని గెలుచుకుంది. జైదేవ్ ఉనద్కత్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం
ఫైనల్ లో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌరాష్ట్ర జట్టు.. తొలి ఇన్నింగ్స్ లో బెంగాల్ ను 174 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ జట్టులో షాబాజ్ అహ్మద్ (69), అభిషేక్ పోరల్ (50) మినహా మిగతా బ్యాటర్లు రాణించలేదు. ఆ తర్వాత సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (50), షెల్డన్ జాక్సన్ (59), అర్పిత్ వసవాడ (81), చిరాగ్ జైనీ (60) పరుగులతో రాణించారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో సౌరాష్ట్ర 230 పరుగుల ఆధిక్యం సాధించింది.
అర్పిత్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్
అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బెంగాల్ 241 పరుగులు చేసింది. మనోజ్ తివారి (68), అనుస్తుప్ మజుందార (61) ఆకట్టుకున్నారు. 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సౌరాష్ట్ర ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. 9 వికెట్ల తేడాతో విజయం సాధించి రంజీ ట్రోఫీని అందుకుంది. ఈ మ్యాచ్ లో 9 వికెట్లు పడగొట్టిన సౌరాష్ట్ర కెప్టెన్ జైదేవ్ ఉనద్కత్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలాగే అదే జట్టు బ్యాటర్ అర్పిత్ వసవాడ (907 పరుగులు)కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్ దక్కింది.