పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం వ్యక్తిత్వం ఎంతో మంచిదని టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసించాడు. ఆటలో ఎదుగుతున్న దశలో ఆ వ్యక్తిత్వం బాబర్ కి ఎంతగానో దోహదపడుతుందని కోహ్లీ అన్నాడు. 


దీనిపై ఓ క్రీడా ఛానల్ తో కోహ్లీ మాట్లాడాడు. అండర్-19 క్రికెట్ నుంచి బాబర్ తనకు తెలుసునని..  2019 ప్రపంచకప్ సందర్భంగా తొలిసారి తనతో మాట్లాడానని విరాట్ గుర్తుచేసుకున్నాడు. అప్పుడు క్రికెట్ గురించే తాము మాట్లాడుకున్నామని చెప్పాడు. అతడి మాటలు, ప్రవర్తనలో ఎంతో మర్యాద కనిపించిందని తెలిపాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో అంచెలంచెలుగా ఎదుగుతున్నా.. బాబర్ ప్రవర్తనలో మాత్రం ఏం తేడా లేదని ప్రశంసించాడు. నాడు, నేడు అలానే ఉన్నాడని కితాబిచ్చాడు. 


బాబర్ ఎంతో ప్రతిభావంతుడని, తన ఆటను ఆస్వాదిస్తున్నాడని విరాట్ అన్నాడు. ఉత్తమంగా రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నాడని చెప్పాడు. అయినా కూడా తనపట్ల అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదని కోహ్లీ కొనియాడాడు. ఆటలో నైపుణ్యం, ఇలాంటి మంచి ప్రవర్తనతో ఎంతోమందికి బాబర్ ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసించాడు. ప్రపంచ క్రికెట్ ఆహ్లాదంగా ఉండేందుకు బాబర్ లాంటి ఆటగాళ్లు అవసరమని విరాట్ అభిప్రాయపడ్డాడు. 


నేడు ఆసియా కప్ లో భాగంగా భారత్- పాకిస్థాన్ లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. 2021 టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లూ తలపడడం ఇదే తొలిసారి. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత జట్టుపై ఘనవిజయం సాధించింది. ఆ ఘోర పరాభవానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.


భారత తుది జట్టు (అంచనా)


 రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్, హార్దిక్ పాండ్యా, చాహల్, జడేజా, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, అవేష్ ఖాన్ రవి బిష్ణోయ్ అశ్విన్.