India vs Pakistan Asia Cup live streaming: భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడూ పోటాపోటీగా సాగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూసే సందర్భం ఇది. ఈ మ్యాచ్ సాధ్యమయ్యేలా చేసిన ఆసియా కప్‌కి థ్యాంక్స్ చెప్పాలి. 2022 ఆసియా కప్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఆగస్టు 27వ తేదీన ప్రారంభమైంది. క్రికెట్ అభిమానులు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ 2022ను టీవీలు, మొబైల్స్ లైవ్ చూసేందుకు అవకాశాలు ఉన్నాయి.
నిజానికి ఈ ఆసియా కప్ టోర్నమెంట్ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే దేశంలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వేదికను అక్కడ నుంచి దుబాయ్‌కి మార్చారు. భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ టీమ్ ఇండియాలో ఉన్నారు. బాబర్ అజామ్ కెప్టెన్సీలో పాకిస్తాన్ జట్టు ఆడనుంది.
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఏ సమయానికి ప్రారంభం అవుతుంది?
భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 గంటలకు దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ ప్రారంభం కావడానికి అరగంట ముందు అంటే రాత్రి 7 గంటలకు టాస్ వేయనున్నారు.
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ టీవీల్లో ఏ చానెల్లో చూడవచ్చు?
ఇండియా vs పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్‌ను స్టార్ గ్రూప్ చానెళ్లలో లైవ్ చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్‌డీ చానెల్‌లలో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల్లో ఎలా చూడాలి?
ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఖాతాలో లాగిన్ అయి ఈ మ్యాచ్‌ను లైవ్ చూడవచ్చు.
2021 టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లూ తలపడడం ఇదే తొలిసారి. ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో భారత జట్టుపై ఘనవిజయం సాధించింది. ఆ ఘోర పరాభవానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.
టీమిండియా పటిష్టంగానే కనిపిస్తోంది. రోహిత్, రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగబోతున్నారు. ఈ జోడి ఎలాంటి భాగస్వామ్యం అందిస్తారో చూడాలి. వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సూపర్ ఫాంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ నుంచి భారత్ మంచి ఇన్నింగ్స్ ఆశిస్తోంది. మిడిలార్డర్ లో పంత్, పాండ్యా రూపంలో మంచి హిట్టర్లు ఉన్నారు. సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు జట్టులో చోటు దక్కే అవకాశం కనిపించట్లేదు. యుజ్వేంద్ర చాహల్‌తో, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. పేస్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ నడిపించనున్నాడు. అతనితో పాటు అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ ఉండనున్నారు. మరో స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం అనుకుంటే అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్‌ల్లో ఒకరికి బదులుగా రవి బిష్ణోయ్, అశ్విన్ లలో ఒకరిని తీసుకునే అవకాశముంది.