ఆసియా కప్ 2022లో భాగంగా నేడు టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. అదే రోజు భారత్‌కు శుభవార్త. కరోనా బారిన పడిన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కోలుకున్నాడు. తాజాగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో నెగటివ్ రావడం భారత జట్టులో సంతోషాన్ని నింపింది. కరోనా నుంచి కోలుకోవడంతో దుబాయ్ లో ఉన్న జట్టుతో హెడ్ కోచ్ ద్రావిడ్ కలవనున్నారు. మరోవైపు ద్రావిడ్ కు కరోనా రావడంతో తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన వీవీఎస్ లక్ష్మణ్ దుబాయ్ నుంచి భారత్ కు తిరిగి రానున్నారు. బెంగూళూరులోని అకాడమీలో టీమిండియా ఏ బాధ్యతలను లక్ష్మణ్ చూసుకుంటారని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.


జట్టుకు అతడు ప్లాస్ పాయింట్.. 
మిస్టర్ కూల్ ద్రావిడ్ కరోనా నుంచి కోలుకోవడం జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది. జట్టులో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు స్వేచ్ఛగా ఆడేందుకు ద్రావిడ్ ఆటగాళ్లకు అవకాశం ఇస్తాడని తెలిసిందే. వారి టాలెంట్ ను ఆధారంగా ఆటగాళ్ల స్థానాలు డిసైడ్ చేస్తాడు. సహజసిద్ధమైన ఆటను ప్లేయర్స్ నుంచి రాబట్టి అద్భుత ఫలితాలు అందించే సత్తా కోచ్ ద్రావిడ్ సొంతం. నేడు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 కు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభం కానుంది.






టీమ్‌ఇండియాకు ఒక్కసారిగా షాక్‌! 
అప్పటి వరకు విశ్వ వేదికపై టీమ్‌ఇండియాదే పైచేయి! దాయాది జట్టుతో తలపడ్డ ప్రతిసారీ భారత్‌ విజయాలు సాధించేది. అలాంటి టీమ్‌ఇండియాకు ఒక్కసారిగా షాక్‌ ఇచ్చింది పాక్. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ భారత జట్టుకు వణుకు పుట్టించింది. దుబాయ్‌ క్రికెట్‌ మైదానంలో ప్రత్యర్థి బౌలర్లు చుక్కలు చూపించారు. మెరుపు బంతులతో టాప్‌, మిడిలార్డర్‌ను కూల్చేశారు. ఇక ఓపెనింగ్‌ బ్యాటర్లైతే భారీ లక్ష్యాన్ని ఉఫ్‌! అని ఊదేస్తూ మరీ దారుణంగా 10 వికెట్ల తేడాతో ఓడించారు. ఇండియా.. ఇండియా అని ఆనందంతో కేరింతలు కొట్టే అభిమానుల నోర్లు కట్టేశారు. సైలెంట్‌గా కూర్చోబెట్టేశారు. చేదు గుణపాఠం నేర్పించారు.


మళ్లీ అదే దుబాయ్‌లో, ఆసియాకప్‌లో భారత్, పాకిస్థాన్‌ ఆదివారం తలపడుతున్నాయి. టైమ్‌ అదే, వేదిక అదే, ప్రత్యర్థి అదే, టోర్నీ అలాంటిదే! మ్యాచుకు ముందు మరొక్కసారి ఆ చేదు గుణపాఠం తల్చుకోవడం హిట్‌మ్యాన్‌ సేనకు అవసరం. ప్రతీకారం తీర్చుకొని మీసం మెలేయాలన్న అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చాలంటే ఆ గుణపాఠం గుర్తుచేసుకోవడం మరొక్కసారి అవసరం. నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రత్యర్థి జట్టులోని ప్రతి ఒక్కరిపై వ్యూహాలు రచించేందుకు ఆ గుణపాఠం నెమరేసుకోవడం అవసరం.


అందరి కళ్లూ కోహ్లీపైనే
ఈ మ్యాచ్ భారత్ తో పాటు కోహ్లీకి చాలా కీలకం. గత కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న విరాట్.. నెల రోజుల విరామం తర్వాత మైదానంలో దిగుతున్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ లో తిరిగి గాడిన పడాలని చూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌నకు 2 నెలలు కూడా లేని సమయంలో కోహ్లీ తిరిగి ఫాంలోకి రావడం చాలా ముఖ్యం.


Also Read: Asia Cup 2022: నేడు దాయాదుల పోరు, ప్రపంచ వ్యాప్తంగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌పై ఆసక్తి