Kohli Naveen Ul Haq Fight: గతనెలలో  ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్‌లో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్‌లు,  నరాలు తెగే ఉత్కంఠ మధ్య  ఆఖరి బంతికి  విజయాలతో పాటు మరో  అంశం భాగా ఫేమస్ అయింది. లీగ్ సెకండాఫ్‌లో  మే 1న లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య  జరిగిన మ్యాచ్‌లో ఎల్‌ఎస్‌జీ పేసర్ నవీన్ ఉల్ హక్ (అఫ్గానిస్తాన్), ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య  వాగ్వాదం చెలరేగింది. అయితే ఈ అంశంలో తన తప్పేమీ లేదని..  వివాదం మొదలైందే విరాట్ కోహ్లీతో అని  తాజాగా నవీన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 


టీ20 బ్లాస్ట్ సందర్భంగా ఇంగ్లాండ్‌లో ఉన్న నవీన్, బీబీసీ  పాస్తో‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మ్యాచ్ సందర్భంగా, ముగిశాక  కోహ్లీ చాలా మాటలన్నాడు. అలా అనుకుండా ఉండాల్సింది. ఆ ఫైట్ నేను మొదలుపెట్టింది కాదు.  మ్యాచ్ ముగిసిన తర్వాత మేం షేక్ హ్యాండ్స్ ఇచ్చుకునేప్పుడు కోహ్లీనే గొడవ ప్రారంభించాడు. కోహ్లీ నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు.  నేను చెప్పేది అబద్దమైతే మీరు మా ఇద్దరి మీద విధించిన జరిమానాలను చూడండి.  మీకే అర్థమవుతుంది..’ అని వాపోయాడు. 


ఈ వివాదం తర్వాత కోహ్లీ ఈ గొడవను ఇక్కడితో మరిచిపోయినా నవీన్ మాత్రం  తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా  కోహ్లీని  టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం  విరాట్ అభిమానులకు కోపం తెప్పించింది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ లో కోహ్లీ నిష్క్రమించాక నవీన్.. ‘మామిడి పండ్లు బాగున్నాయి’ అని పెట్టడం వారిని మరింత రెచ్చగొట్టించింది. ఇక ఈ దెబ్బతో నవీన్ ఎక్కడ కనబడ్డా కోహ్లీ ఫ్యాన్స్.. ‘కోహ్లీ.. కోహ్లీ..’ అని అరిచారు.  


 






నేను ఒక్క మాట అనలేదు.. 


ఈ వివాదంపై నవీన్ ఇంకా విపులకరిస్తూ.. ‘సాధారణంగా నేను ఎవరినీ స్లెడ్జ్ చేయను. ఒకవేళ చేయాల్సి వస్తే  అది బ్యాటర్లను మాత్రమే చేస్తా. ఎందుకంటే నేను బౌలర్‌ను కాబట్టి.  మీరు  గమనిస్తే ఆ మ్యాచ్‌లో నేను కోహ్లీని ఒక్క మాట కూడా అనలేదు. నేను కోహ్లీని స్లెడ్జ్ చేయలేదు.  నేను చెప్పేది అబద్దమైతే అక్కడున్న ప్లేయర్స్‌ను అడగండి. అక్కడ జరిగిన పరిస్థితిని  మీకు కళ్లకు కట్టినట్టు చెబుతారు.


నేనెప్పుడూ నియంత్రణ కోల్పోను. నేను బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మ్యాచ్ ముగిసిన తర్వాత  ఏం చేశానన్నది మీకు వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి.  నేను జస్ట్ షేక్ హ్యాండ్ మాత్రమే ఇచ్చా. కానీ కోహ్లీ నా చేతిని గట్టిగా పట్టుకుని  వాగ్వాదానికి దిగాడు.  అప్పుడు నేను రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే నేనూ మనిషినే కదా..’అని  వ్యాఖ్యానించాడు. 


ఇదే వ్యవహారంపై ఇటీవల  లక్నో మెంటార్ గౌతం గంభీర్ కూడా స్పందిస్తూ..  ఇందులో నవీన్ తప్పేం లేదని  అందుకే తాను అతడి వైపున నిల్చున్నానని  చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.  తాను నిజం వైపున నిల్చున్నానని అక్కడ నవీన్ కాకుండా మరెవరు ఉన్నా తాను   నిజం వైపే ఉంటానని  తెలిపాడు.