Asia Cup 2023, Jasprit Bumrah:
టీమ్‌ఇండియాకు వరుసగా శుభ శకునాలే ఎదురవుతున్నాయి! గాయాల పాలైన ఆటగాళ్లు వేగంగా కోలుకుంటున్నారు. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఆసియాకప్-2023కి అందుబాటులో ఉంటారని తెలిసింది. ఇక ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ తన రికవరీతో బీసీసీఐనే సర్‌ప్రైజ్ చేస్తున్నాడు.
మూడు ఫార్మాట్లలో టీమ్‌ఇండియాకు వెన్నెముకగా మారాడు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)! ఎన్నో మ్యాచులను ఒంటిచేత్తో గెలిపించాడు. వెన్నెముక గాయంతో 2022 సెప్టెంబర్ నుంచి క్రికెట్‌కు దూరమయ్యాడు. దాంతో ఆస్ట్రేలియాలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దాంతో ఏప్రిల్‌లో అతడు న్యూజిలాండ్‌కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. సర్జరీ విజయవంతం కావడంతో అతనిప్పుడు వెన్నెముక నొప్పి నుంచి బయటపడ్డాడు.
బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సైతం వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దిగువ వెన్నెముక గాయంతో ఏప్రిల్‌లో క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆఖరి టెస్టు ఆడలేదు. మే నెలలో లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహబిలిటేషన్ పొందుతున్నాడు. మొత్తానికి వీరిద్దరినీ సెప్టెంబర్‌లో ఆసియాకప్-2023కి సిద్ధం చేయాలని ఎన్‌సీఏ మేనేజ్‌మెంట్ పట్టుదలగా ఉంది.
జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఫిజియో థెరపీ చేయించుకుంటున్నాడని, కొద్ది కొద్దిగా బౌలింగ్ చేస్తున్నాడని తెలిసింది. మెల్లిమెల్లిగా అతడిపై పనిభారం పెంచుతారు. శ్రేయస్ మాత్రం ఇంకా ఫిజియో థెరపీ ప్రాసెస్‌లోనే ఉన్నాడని అంటున్నారు. అయితే వీరిని నేరుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడించొద్దని విశ్లేషకులు, అభిమానులు భావిస్తున్నారు. మొదట దేశవాళీ క్రికెట్లో ఆడించి ఫిట్‌నెస్ తనిఖీ చేయాలని సూచిస్తున్నారు.
మరోవైపు టీమ్‌ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ అత్యంత వేగంగా కోలుకుంటున్నాడు. తన పాజిటివ్‌నెస్‌తో బీసీసీఐని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఎన్‌సీఏ సిబ్బంది అతడిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నారు. ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో పంత్‌ను ఐసీసీ వన్డే ప్రపంచకప్‌నకు సిద్ధం చేయాలని బోర్డు పట్టుదలతో ఉంది. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ పంత్ ఇప్పుడిప్పుడే నడుస్తున్నాడు. క్రచెస్ లేకుండా మెట్లు ఎక్కుతున్నాడు. ప్రస్తుతానికి అతడికి ఎలాంటి నొప్పి లేదని త్వరలోనే ఫిజియో రజినికాంత్ నేతృత్వంలో ఫిట్‌నెస్ కసరత్తులు మొదలు పెడతాడని తెలిసింది. మరో ఫిజియో థెరపిస్ట్ తులసీరామ్ యువరాజ్ సైతం అతడికి అండగా ఉన్నాడు.
మరోవైపు ఆసియాకప్ -2023కి మార్గం సుగమమైంది! మొత్తానికి సందిగ్ధం తొలగిపోయింది. టోర్నీని హైబ్రీడ్ మోడల్‌లో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు మ్యాచులు జరుగుతాయి. పూర్తి స్థాయి షెడ్యూలు ఇంకా రూపొందించలేదు. మరికొన్ని రోజుల్లోనే విడుదల చేస్తారని సమాచారం.
వాస్తవంగా ఆసియాకప్ టోర్నీ పాకిస్థాన్‌లోనే జరగాలి. కానీ టీమ్‌ఇండియా దాయాది దేశంలో అడుగు పెట్టబోదని బీసీసీఐ ఖరాకండీగా చెప్పేయడంతో హైబ్రీడి మోడల్‌కు మారింది. దీనికి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంగీకరించింది. మొత్తం 13 మ్యాచుల్లో 4 పాకిస్థాన్, మిగిలినవి శ్రీలంకలో జరుగుతాయి. మొత్తానికి 2008 తర్వాత పాకిస్థాన్ రెండు కన్నా ఎక్కువ దేశాలు ఆడే టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది.