Ravichandran Ashwin: 


విదేశాల్లో తనకు అత్యుత్తమ రికార్డు ఉందని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ అంటున్నాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆడాలని ఎంతగానో కలగన్నానని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌లో అంతకు ముందు నలుగురు సీమర్లు ఒక సిన్నర్‌ ఫార్ములాను అనుసరించారని అందుకే ఈసారీ అలాగే చేశారని వెల్లడించాడు. తనను బయటవాళ్లు విమర్శించాల్సిన అవసరం లేదని.. తనకు తానే అతిపెద్ద విమర్శకుడినని స్పష్టం చేశాడు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.


'ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో నేనూ ఆడాలనే అనుకున్నా. కానీ మ్యాచ్‌ ముగియడంతో ఇప్పుడు మాట్లాడుకోవడంలో అర్థం లేదు. ఏదేమైనా టీమ్‌ఇండియాను ఫైనల్‌కు తీసుకురావడంలో నా పాత్ర ఎంతైనా ఉంది. అంతెందుకు మొదటి డబ్ల్యూటీసీ ఫైనల్లో నేను నాలుగు వికెట్లు తీశాను. చక్కగా బౌలింగ్‌ చేశాను' అని రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. 2018-19 సీజన్ నుంచి విదేశాల్లో తన ప్రదర్శన చాలా బాగుందని చెప్పాడు.


'2018-19 సీజన్‌ నుంచి విదేశాల్లో నా బౌలింగ్‌ ఫెంటాస్టిక్‌గా ఉంది. టీమ్‌ఇండియాకు విజయాలు అందించాను. ఒక కెప్టెన్‌, కోచ్‌ దృక్పథంతో నేను మాట్లాడుతున్నాను. వారికి అండగా ఉంటాను. చివరిసారి మేం ఇంగ్లాండ్‌లో పర్యటించినప్పుడు 4-4తో సమంగా ఉన్నాం. ఆఖరి టెస్టును డ్రా చేసుకున్నాం. అప్పుడు 4 పేసర్లు ఒక స్పిన్నర్‌ సూత్రాన్ని అనుసరించారు. అందుకే ఫైనల్లోనూ ఇలాంటి ఫార్ములానే అనుసరించారు. ఇంగ్లాండ్‌లో నాలుగో ఇన్నింగ్సులోనే స్పిన్నర్‌ అవసరం అవుతాడు. అది చాలా చాలా కీలకం. స్పిన్నర్‌ పాత్ర పరిధి పెరుగుతుంది. ఇదంతా మైండ్‌సెట్‌కు సంబంధించిన అంశం' అని యాష్‌ తెలిపాడు.


Also Read: బజ్‌బాల్ వర్సెస్ వరల్డ్ ఛాంపియన్స్ - యాషెస్ సమరాన్ని చూసేయండిలా!


ఇతరులు తన గురించి ఏం మాట్లాడుకుంటారో పట్టించుకోనని యాష్‌ అన్నాడు. తన ప్రదర్శనకు తానే పెద్ద విమర్శకుడినని చెప్పాడు. 'అంతర్మథనం చేసుకోవడం అవసరం. ఇతరులు నన్ను జడ్జ్‌ చేయడం మూర్ఖత్వం. నా సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. ఒకవేళ నేను బాగా ఆడకపోతే ముందు నేనే క్రిటిక్‌గా మారిపోతాను. ఆ తర్వాత బలహీనతపై దృష్టి పెడతాను. ప్రతిష్ఠ కోసం పాకులాడను. నిత్యం సరికొత్త టెక్నిక్స్‌ నేర్చుకుంటూనే ఉంటాను. నన్ను ఎవరెవరు విమర్శిస్తున్నారోనని ఆలోచించడం అవివేకం' అని చెప్పాడు.


ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ గదను సొంతం చేసుకొనేందుకు 444 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా అందులో కనీసం ముప్పావు స్కోరైనా చేయలేదు. రెండో ఇన్నింగ్సులో 63.3 ఓవర్లు ఆడి 234 పరుగులకే ఆలౌటైంది. ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. విరాట్‌ కోహ్లీ (49; 78 బంతుల్లో 7x4), అజింక్య రహానె (46; 108 బంతుల్లో 7x4), రోహిత్‌ శర్మ (43; 60 బంతుల్లో 7x4, 1x6) టాప్‌ స్కోరర్లు. చెతేశ్వర్‌ పుజారా (27; 47 బంతుల్లో 5x4), శ్రీకర్ భరత్‌ (23; 41 బంతుల్లో 2x4) ఏదో మోస్తరు స్కోర్లు చేశారు.