IND vs WI: డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం భారత జట్టు నెలరోజుల విరామం తర్వాత  వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ టీమిండియా మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడాల్సి ఉంది.  టెస్టు సిరీస్‌తో మొదలయ్యే  ఈ  పర్యటన.. టీ20లతో ముగియనుంది. అయితే  నెల రోజుల తర్వాత క్రికెట్ ఆడనున్నా  బీసీసీఐ మాత్రం.. టీమిండియా సారథి రోహిత్ శర్మకు ఏదో ఒక ఫార్మాట్‌లో మరోసారి  విశ్రాంతినివ్వనుందని సమాచారం. 


ఆడేది ఒక ఫార్మాటే.. 


గతేడాది టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత  రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, అశ్విన్ వంటి సీనియర్లను  పొట్టి ఫార్మాట్‌లో పట్టించుకోవడం లేదు.  2024 టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో యువ జట్టును  సిద్ధం చేస్తూ సీనియర్లకు రెస్ట్ ఇస్తోంది. దీని ప్రకారం.. కరేబియన్ జట్టుతో  టీ20 సిరీస్‌కు  రోహిత్ ఎలా ఆడడు. ఇక మిగిలింది టెస్టు, వన్డేలే.  నెల రోజుల తర్వాత ఆడనున్నా  ఈ రెండింటిలో ఏదో ఒక ఫార్మాట్ నుంచి అతడికి విశ్రాంతినిచ్చే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.  


జులై 12-16 మధ్య తొలి టెస్టు, 20-24 నుంచి  రెండో టెస్టు జరుగనుండగా జులై 27 నుంచి ఆగస్టు 1 వరకూ  మూడు వన్డేలు జరుగుతాయి.  ఈ రెండింటిలో ఏదో ఒక ఫార్మాట్‌ నుంచి  రోహిత్ తప్పుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయట. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రోహిత్ కాస్త నీరసంగా కనిపించాడు.  అతడు తన రిథమ్‌ను కోల్పోయాడు. అందుకే విండీస్ టూర్‌లో కొంత భాగం అతడికి  విశ్రాంతినివ్వనివ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. అయితే ఇది టెస్టులా, వన్డేలా..? అన్నది ఇంకా నిర్ణయించలేదు.  రోహిత్‌తో మాట్లాడిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం..’ అని  చెప్పాడు.   డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత రోహిత్.. ప్రస్తుతం తన భార్యతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. 


ఏ ఫార్మాట్‌లో ఎవరు..?


కాగా రోహిత్‌కు టెస్టులలో విశ్రాంతినిస్తే అజింక్యా రహానే ను గానీ రవీంద్ర జడేజాను గానీ  స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా ఎంపిక చేసే అవకాశముంది.  వన్డేలలో రోహిత్ రెస్ట్ తీసుకుంటే హార్ధిక్ పాండ్యా ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు. 


పేలవ ఫామ్..


గత కొంతకాలంగా రోహిత్.. పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. మరీ ముఖ్యంగా టీమిండియా సారథ్య పగ్గాలు అందుకున్న తర్వాత  చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే ఆడింది లేదు.  ఐపీఎల్-16 లో రోహిత్.. 16 మ్యాచ్‌లలో 332 పరుగుగులు చేశాడు.  ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.  ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో  15, 43 పరుగులతో మరోసారి నిరాశపరిచాడు.  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో  రోహిత్ సెంచరీ (120) చేయడం మినహా ఇటీవలి కాలంలో అతడి టెస్టు ఫామ్ కూడా అంత గొప్పగా లేదు. మరి  రోహిత్ ఏ ఫార్మాట్ నుంచి విశ్రాంతి తీసుకుంటాడన్నది ఇప్పటికైతే సస్పెన్సే.. 


మళ్లీ ఎందుకు..? 


వాస్తవానికి  డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత  టీమిండియాకు నెల రోజుల పాటు  మ్యాచ్‌లు లేవు.   జులై  12 నుంచి  భారత్ ఫుల్ ప్యాక్డ్ షెడ్యూల్‌తో గడపనుంది. వెస్టిండీస్ సిరీస్  ఆగస్టు 13 వరకూ సాగుతుండగా ఆ తర్వాత ఐర్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి (టీ20లకు రోహిత్ పేరును పరిగణనలో తీసుకోవడం లేదు)  ఉంది. ఆ తర్వాత ఆసియ కప్.. ఆ వెంటనే స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. అక్టోబర్ లో వన్డే వరల్డ్ కప్‌తో తీరికలేని షెడ్యూల్ ఉంది.  వరల్డ్ కప్ నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు కావాల్సినంత విశ్రాంతినిచ్చేందుకే రోహిత్‌కు  విండీస్ టూర్ లో ఏదో ఒక ఫార్మాట్  ల దూరంగా ఉంచనున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.