Virat Kohli News: ఆస్ట్రేలియన్ మీడియాతో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గొడవ పడ్డాడు. మెల్ బర్న్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా విలేకరులపై కోపానికి వచ్చిన కోహ్లీ.. తర్వాత జరిగింది తెలుసుకుని కూలయ్యాడు. నిజానికి బ్రిస్బేన్‌లో మూడో టెస్టు జరిగిన తర్వాత టీమిండియా నాలుగో టెస్టు వేదికైన మెల్ బోర్న్‌లోని ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో ఆసీస్ పేసర్ స్కాట్ బోలాండ్‌ను అప్పటికే ఆసీస్ మీడియా ఇంటర్వ్యూ చేస్తోంది. ఎప్పుడైతే కోహ్లీ తన కుటుంబంతో ఎయిర్‌పోర్టులోకి వచ్చాడో ఆసీస్ మీడియా ఫోకస్ అంతా కోహ్లీ ఫ్యామిలీపైకి షిఫ్టయ్యింది. ఇది గమనించిన కోహ్లీ.. మీడియా పర్సన్ వద్దకొచ్చి మాటల యుద్ధానికి దిగాడు.
ప్రైవసీ ముఖ్యం..
స్టార్ క్రికెటర్ అయిన కారణంగా ఇప్పటికే భారత్‌తో సహా కొన్ని దేశాల్లో కోహ్లీ ప్రైవసీ అన్నది లేకుండా పోతోంది. చాలాచోట్ల తను ఎంటరైన వెంటనే కెమేరాలను క్లిక్ మనిపిస్తూ గుమిగూడటం సహజంగా మారింది. దీంతో తన కుటుంబ సభ్యులు ముఖ్యంగా తన పిల్లలైన వామిక, అకాయ్‌లకు ప్రైవసీ కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ల ఫొటోలు బయటకు రాకుండా కోహ్లీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వాళ్లతో ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నప్పటికీ, ఫేసులను కవర్ చేస్తూ కేర్ తీసుకుంటున్నాడు. అయితే ఎన్నిసార్లు జాగ్రత్త వహించినా, తన అనుమతి లేకుండా పిల్లల ఫొటోలు మీడియాలో తీసుకోవడంపై కోహ్లీకి అభ్యంతరం ఉంది. ఈ నేపథ్యంలో మెల్ బోర్న్ ఎయిర్‌పోర్టులో మీడియాపై కోహ్లీ గుస్సాకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మీడియా దగ్గరున్న ఫుటేజీని పరిశీలించిన తర్వాత కోహ్లీ కూలయ్యాడని తెలుస్తోంది.
మీడియాతో హేండ్ షేక్..
అయితే ఈ ఘటనలో మీడియా తన పిల్లల ఫొటోలు తీసుకోలేదని కోహ్లీ.. ఫుటేజీని పరిశీలించిన తర్వాత నిర్ణయానికొచ్చాడు. ఆ తర్వాత అక్కడున్న మీడియా వాళ్లకు షేక్ హ్యాండిచ్చి వివాదానికి ముగింపు పలికాడు. ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వివాదానికి సంబంధించిన ఫుటేజీని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో కోహ్లీ అంతంతమాత్రంగానే రాణిస్తున్నాడు. ఇప్పటివరకు మూడు టెస్టులాడిన ఈ వెటరన్.. ఐదు ఇన్సింగ్స్‌లో ఒక్క సెంచరీ మాత్రమే సాధించగా, మిగతా నాలుగు ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. అంతకుముందు కూడా కివీస్ సిరిస్‌లో తేలిపోయాడు. దీంతో మిగతా రెండు టెస్టుల్లో సత్తా చాటాలనే ఒత్తిడి కోహ్లీపై ఉంది. ముఖ్యంగా తనను ఇబ్బంది పెడుతున్న ఆఫ్ స్టంప్ బలహీనతను అధిగమనించాలని మాజీలు కూడా కోహ్లీకి సూచిస్తున్నారు. ఇక నాలుగో టెస్టుకు దాదాపు వారం రోజుల గ్యాప్ వచ్చిన క్రమంలో మరింత బాగా ఫోకస్ పెంచి సత్తా చాటాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఐదు టెస్టుల బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను 295 పరుగులతో భారత్ కైవసం చేసుకోగా, రెండోటెస్టును పది వికెట్లతో ఆసీస్ నెగ్గింది. వర్షం కారణంగా మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్‌లో 1-1తో ఇరుజట్లు సమంగా ఉన్నాయి. ఈనెల 26 నుంచి మెల్ బోర్న్‌లో నాలుగోదైన బాక్సింగ్ డే టెస్టు జరుగుతుంది.