Ashwin vs Jadeja A Tale of Two Spin Kings:

దిగ్గజాల రిటైర్ మెంట్ తర్వాత సంది దశలో ఉన్న భారత స్పిన్ భారాన్ని మోసిన ఇద్దరు దిగ్గజ స్పిన్నర్లు ఎవరంటే కచ్చితంగా రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin)- రవీంద్ర జడేజా(Ravindra Jadeja). బంతితోపాటు బ్యాట్ తోనూ రాణించగల సామర్థ్యం ఉన్న ఈ ఇద్దరు క్రికెటర్లు... టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. రైట్ ఆర్మ్ స్పిన్ తో అశ్విన్.. లెఫ్టార్మ్ స్పిన్ తో జడేజా బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేసి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. ప్రపంచంలోని బెస్ట్ ఆల్ రౌండర్లలో వీరు ఉంటారు.

అశ్విన్  రవీంద్ర జడేజా కలిసి ఆడిన 58 టెస్టుల్లో 587 వికెట్లు తీశారు. ఈ స్పిన్ ద్వయం అత్యధిక వికెట్లు తీసిన జోడీగా ఆరో స్థానంలో ఉన్నారు. అశ్విన్- జడేజా ఆడిన 58 టెస్టుల్లో 49 స్వదేశంలోనే జరిగాయి. అందులో భారత్ విజయ శతాం 71 శాతం. అంటే వీరిద్దరి ఆధిపత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్వదేశంలో అశ్విన్- రవీంద్ర జడేజా జోడి 58 టెసులు ఆడితే అందులో 35 టెస్టుల్లో భారత్ విజయం సాధించింది. 

 

దిగ్గజాల ప్రయాణం..

రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్న ఘటనలు సగటు భారత అభిమాని చాలాసార్లు చూసుంటాడు. ఎందుకే భారత్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు వచ్చే వీరిద్దరూ విజయంతో ముగించే వెనుదిరుగుతారు. ఆ దశలో వీరిద్దరి మధ్య ఉన్న అవగాహన చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఓ వైపు బంతితో.. మరోవైపు బ్యాటుతో ఈ ద్వయం తమకు అప్పగించిన  పనిని విజయవంతంగా పూర్తి చేస్తుంది. 

 

అశ్విన్, జడేజా ఏజ్ మ్యాటర్

అశ్విన్‌కి 38 ఏళ్లు, జడేజాకు త్వరలో 36 ఏళ్లు వస్తాయి. దాదాపు ఒకే వయసు కావడం కూడా వీరిద్దరి మధ్య సఖ్యతకు కారణమైంది. టీమిండియాలో దిగ్గజాలు అంటే వెంటనే కోహ్లీ, రోహిత్, జస్ప్రీత్ బుమ్రా పేర్లే ముందు వినిపిస్తాయి. కానీ అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లు ఎవరంటే మాత్రం తప్పకుండా అశ్విన్- జడేజా పేర్లు వినిపించాల్సిందే. బ్యాట్,  బాల్ రెండింటితో  వీరిద్దరూ చెలరేగిపోతారు. ముఖ్యంగా ఈ స్పిన్ ద్వయం వల్లే భారత్‌కు టెస్టు మ్యాచ్‌లు గెలవడం చాలా తేలికగా మారిపోయిందని చాలామంది మాజీ క్రికెటర్లు కూడా తెల్చేశారు.

 


 

ఇద్దరిలో ఎవరూ తగ్గరు..

స్వదేశంలో అశ్విన్ 263 వికెట్లు తీస్తే... జడేజా 218 వికెట్లు తీసుకున్నాడు. జడేజా బ్యాట్‌తో 1910 పరుగులు చేస్తే.. అశ్విన్ 1141 పరుగులు చేశాడు. "నేను జడేజాను చూసి ఆసూయపడతాను. అతని ఆటను ఆరాధిస్తాను. గత 4-5 సంవత్సరాలుగా నేను అతనిని అభిమానించడం నేర్చుకున్నాను. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా అభిమానిస్తున్నా. జట్టులో జడేజాతో పోటీని నేను అస్వాదించాను.” అని అశ్విన్ ప్రకటించడం అతడికి జడేజా పట్ల ఉన్న సఖ్యతకు నిదర్శనం. అశ్విన్, జడేజా రెండో ఇన్నింగ్స్ లో చాలా కీలకమైన ఇన్నింగ్సులు ఆడారు. అశ్విన్‌ ఇప్పటివరకూ 37వ ఐదు వికెట్ల ప్రదర్శనలు చేశాడు.