Cricket News: భారత స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి, అందరినీ షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరమైన అశ్విన్.. టెస్టులకు మాత్రమే భారత్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ ల్లో టీమిండియాలో చోటుకు ఢోకా లేకపోయినప్పటికీ, విదేశాల్లో జరుగుతున్న టెస్టుల్లో మాత్రమే వివిధ రకాల సమీకరణాలను బట్టి, అతనికి జట్టులో చోటు విషయంలో కొన్నిసార్లు చుక్కెదురైంది. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో మూడు టెస్టులు జరిగితే కేవలం అడిలైడ్ టెస్టులో మాత్రమే తను ఆడాడు. స్పెషలిస్టు స్పిన్నర్ కమ్ ఆల్ రౌండర్ కోటాలో బరిలోకి దిగినప్పటికీ, బ్యాట్ తో అంతంతమాత్రంగానే రాణించిన అశ్విన్.. బాల్ తో మాత్రం ఒక్కవికెట్ తీశాడు. అయితే తను ఇంత సడెన్ గా రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక కొన్ని కారణాలున్నాయని కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
గాయాలు, భవిష్యత్తుపై ఆలోచనతోనే..
38 ఏళ్ల అశ్విన్.. ఇప్పటికే మోకాలి గాయంతో సతమతం అవుతున్నాడు. ఇప్పటికే గాయానికి చికిత్స తీసుకున్నప్పటికీ, అది కొన్నిసార్లు తిరగబెట్టడం జరిగింది. అలాగే గత ఆసీస్ పర్యటనలో తను వెన్నునొప్పితో బాధపడ్డాడు. ఇలా తన ఫిట్నెస్ విషయంలో అశ్విన్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ఏజ్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రస్తుతం 38వ పడిలో ఉన్న అశ్విన్.. మరో రెండు, మూడేళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడగల సత్తా ఉంది. బేసిగ్గా తను స్పిన్నరే కాబట్టి, బండి లాగించేయొచ్చు. కానీ, పెరుగుతున్న వయసు కారణంగా యువకులకు అవకాశం ఇవ్వాలనే కోణంలో అశ్విన్ ఏమైనా సడెన్ రిటైర్మెంట్ తీసుకున్నాడనేది ప్రచారంలో ఉంది. అశ్విన్, రవీంద్ర జడేజాల కారణంగా కొన్నిసార్లు లెఫ్టార్మ్ స్మిన్నర్ కుల్దీప్ యాదవ్ బెంచ్ కే పరిమితమవుతున్నాడు. అలాగే మరికొంతమంది ప్రతిభావంతులకు కనుచూపు మేరలో టీమిండియాలో చోటు ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో తను తప్పుకుంటే యువ బౌలర్లకు దారి ఇవ్వచ్చనేది అశ్విన్ భావనగా కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఏదేమైనా భారత గడ్డపై అత్యంత ప్రభావవంతంగా కనిపించే అశ్విన్.. రిటైర్మెంట్ ప్రకటించడం టీమిండియాకు కచ్చితంగా లోటేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
రిటైర్మెంట్ పై ముందు రోజే నిర్ణయం..
నిజానికి ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరే ముందే రిటైర్మెంట్ ఆలోచనను తన కుటుంబ సభ్యులతో అశ్విన్ పంచుకున్నాడు. అయితే దీనిపై మరింత కసరత్తు చేయాలని, ప్రస్తుతానికి ఈ విషయాన్ని వాయిదా వేయాలని ఆయన కుటుంబ సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆసీస్ పర్యటనలో మూడో టెస్టు ముగింపు వచ్చేవరకల్లా తన రిటైర్మెంట్ పై అశ్విన్ నిర్ణయం తీసుకున్నాడు. అంతకుముందే జట్టులోని ప్రతి ఒక్కరితో రిటైర్మెంట్ గురించి అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అయితే అందరి నుంచి షాకింగ్ ఎక్స్ప్రెషనే వచ్చినట్లు సమాచారం. ఇక మూడో టెస్టులో స్పెషలిస్టు స్పిన్నర్ కమ్ ఆల్ రౌండర్ కోటాలో బరిలోకి దిగిన జడేజా సత్తా చాటడంతో మిగతా రెండు టెస్టులకు తనకు చాన్స్ రాబోదని గ్రహించిన అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు బోగట్టా. ఇక రిటైర్మెంట్ తీసుకున్న విషయాన్ని మంగళవారం రాత్రి మాత్రమే తన కుటుంబ సభ్యులకు అశ్విన్ తెలిపాడు. దీంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ షాక్ కు గురయ్యారని తెలుస్తోంది. ఆ తర్వాత సడెన్ గా బుధవారం మ్యాచ్ ముగిశాక రిటైర్మెంట్ పై ప్రకటన చేశాడు. మొత్తానికి 106 టెస్టుల్లో భారత్ కు ప్రాతినిథ్యం వహించిన ఈ లెజెండ్.. 537 వికెట్లు తన ఖాతలో వేసుకున్నాడు. అందులో 8 సార్లు పది వికెట్ల ప్రదర్శన, 37 సార్లు ఫైవ్ వికెట్ హాల్స్ ఉండటం విశేషం. ఇక చివరగా భారత్ తరపున అడిలైడ్ లో బౌలింగ్ చేసిన అశ్విన్.. మిషెల్ మార్ష్ ను ఔట్ చేశాడు. ఆ మ్యాచ్ లో 18 ఓవర్లు వేసిన అశ్విన్, 53 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.
Also Read: "స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్