Ramcharan: భారత క్రికెట్ దైవం సచిన్ టెండూల్కర్ తర్వాత అంత స్థాయిలో ఆటను, అభిమానులను సాధించుకున్న ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రోకు సంబంధించి ఏ విషయం వచ్చినా అది క్షణాల్లో వైరల్ కావాల్సిందే. కోహ్లీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి. తాజా సమాచారం ప్రకారం విరాట్ కోహ్లీ బయోపిక్ చర్చ మరోసారి మొదలైంది. బాలీవుడ్‌లో బడా సినిమాలు తీసే ఓ భారీ నిర్మాణ సంస్థ.. టీమిండియా మాజీ సారథి బయోపిక్ తీసేందుకు రెడీ అయిందని తెలుస్తున్నది. అదీగాక కోహ్లీ పాత్రలో నటించేది ఎవరో కాదు.. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అని టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
క్లీన్ టోన్డ్ బాడీతో ఉండే కోహ్లీ పాత్ర కోసం బాలీవుడ్‌లో కొంతమంది హీరోలను సంప్రదించి విఫలమైన సదరు నిర్మాతలు.. ఇంచుమించు అదే దేహధారుడ్యంతో ఉండే చరణ్ అయితే విరాట్ పాత్రకు న్యాయం చేస్తారని భావిస్తున్నారట.. ఆటగాడిగా కోహ్లీ లోని దూకుడు, అగ్రెసివ్ అటిట్యూడ్‌తో పాటు ఇతరుల పట్ల వినయంగా ఉండటం వంటివి చరణ్ లోనూ ఉన్నాయి. ఇద్దరూ ఎంచుకున్న రంగాలు వేరు అయినా ఆ భావాలను స్క్రీన్‌పై పండించడంలో చిరు తనయుడు అభిమానులను మెప్పిస్తాడని నిర్మాతలు అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. కోహ్లీ బయోపిక్‌కు సంబంధించి వాళ్లు అనుకుంటున్న విధంగా తనను తాను ఛేంజ్ చేసుకోవడానికి చరణ్ కూడా సిద్ధంగా ఉండటంతో ఈ చిత్రాన్ని వీలున్నంత త్వరగా మొదలుపెట్టనున్నారని తెలుస్తున్నది.
కోహ్లీ సినిమా చేయబోయే నిర్మాతలు ఇదివరకే ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్‌తో చరణ్‌కు కథ చెప్పారని, ఆ ప్రాజెక్టు చేయడానికి ఆర్ఆర్ఆర్ హీరో కూడా సిద్ధమయ్యాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్‌చరణ్.. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పనులు దాదాపు చివరిదశకు వచ్చాయి. ఈ ఏడాది చివర్లో గానీ వచ్చే సంక్రాంతికి గానీ గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత చరణ్.. ఇంకా తాను తర్వాత చేయబోయే చిత్రాలపై కూడా అప్డేట్ ఇవ్వలేదు. గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న చరణ్.. శంకర్ సినిమా తర్వాత ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చినా ఈ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు. బుచ్చిబాబు సినిమా కంటే ముందే కోహ్లీ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని కూడా టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
విరాట్ బయోపిక్‌లో నటించాలని తనకూ ఉందని రామ్ చరణ్ గతంలోనే తన ఆసక్తిని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇండియా టుడే నిర్వహించిన ఓ కార్యక్రమంలో చరణ్.. తనకూ కోహ్లీ అంటే ఇష్టమని, ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని స్పష్టం చేశాడు. మరి గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ కోహ్లీ బయోపిక్ లోనే నటిస్తాడా..? లేదా..?అనేది త్వరలోనే తేలనుంది. చరణ్ కోహ్లీ బయోపిక్ లో నటించాలని మెగా అభిమానులు కూడా కోరుకుంటున్న వేళ ఈ ప్రాజెక్టు మెగా పవర్ స్టార్‌నే వరిస్తుందా..? లేక మరెవరైనా స్టార్ వస్తారా..? అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే..!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial