Asia Cup 2023: శ్రీలంకలో  వర్షాల కారణంగా  హై ఓల్టేజ్ మ్యాచ్ అయిన  భారత్ - పాకిస్తాన్‌తో పాటు  భారత్ - నేపాల్ మ్యాచ్‌కూ వర్షం అడ్డంకి కల్పించిన నేపథ్యంలో  టోర్నీ నిర్వహణపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ముఖ్యంగా  సెప్టెంబర్‌లో  శ్రీలంకలో వర్షాలు కురుస్తాయని తెలిసినా ఇక్కడ   ఆసియా కప్‌ను నిర్వహించడం అర్థరహితమని  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ  చీఫ్ నజమ్ సేథీ  విమర్శలు గుప్పించాడు. యూఏఈలో నిర్వహించాలని తాను చెప్పినా ఏసీసీ వినలేదేని,  జై షాను లక్ష్యంగా చేసుకుని ఆయన మూడు రోజులుగా వరుసగా ట్వీట్ల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఆయన  స్పందించాడు. ఇదేమీ తాను ఒక్కడు తీసుకున్న నిర్ణయం కాదని,  యూఏఈలో ఆడలేమని అన్ని జట్లు చెప్పడంతోనే   శ్రీలంకలో నిర్వహిస్తున్నామని స్పష్టం చేశాడు.


మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో  జై షా.. ‘ఆసియా కప్‌ను గతేడాది యూఏఈలో టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు.  20 ఓవర్ల క్రికెట్‌కు 50 ఓవర్ల ఫార్మాట్‌తో పోల్చలేం.  ఈ నేపథ్యంలో ఏసీసీ.. సభ్య దేశాల నుంచి అభిప్రాయాలను కోరింది. అయితే  దాదాపు అన్ని దేశాలూ  యూఏఈలో ఆడేందుకు నిరాకరించాయి.  సెప్టెంబర్‌లో యూఏఈలో  ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి.  ఆటగాళ్లకు అలసట, గాయాల వంటి  సమస్యలు తలెత్తితే, అదీ వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో ఇలాంటివి జట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశమున్న నేపథ్యంలో  యూఏఈలో ఆసియా కప్ నిర్వహణకు వెనుకడుగు వేశాయి.. 


ఇక ఏసీసీలోని ఫుల్ మెంబర్స్, మీడియా హక్కులు కలిగిఉన్న సంస్థతో పాటు ఇతరులు  కూడా పాకిస్తాన్‌లో పూర్తి టోర్నీ నిర్వహణను భద్రతా, ఆర్థిక కారణలతో ససేమిరా వద్దన్నారు.  ఏసీసీ అధ్యక్షుడిగా  నేను అందరు సభ్యులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించేదిశగా కృషి చేశాను.  అదీగాక  ఈ టోర్నీలో హైబ్రిడ్ మోడల్‌ను సూచించింది కూడా పాకిస్తానే. అందుకు నేను  కూడా అంగీకారం తెలిపాను..’ అని పేర్కొన్నాడు. 


 






భారత్ - పాక్ మ్యాచ్ వర్షార్పణం అయిన తర్వాత నజమ్ సేథీ ట్విటర్‌‌లో.. ‘ప్రపంచంలోనే గొప్ప  క్రికెట్ సమరాల్లో ఒకటి అయిన మ్యాచ్  వర్షం కారణంగా అర్థాంతరంగా   రద్దు అయింది.  కానీ ఇది ముందే ఊహించింది.  పీసీబీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను ఈ టోర్నీని శ్రీలంకలో  నిర్వహించవద్దని  ఏసీసీని కోరాను. యూఏఈలో అయితే బెటర్ అని వారి (ఏసీసీతో)తో వారించాను.  కానీ వాళ్లు దానికి విచిత్రమైన సాకులు చెప్పారు.  సెప్టెంబర్‌లో  యూఏఈలో వేడి ఎక్కువగా ఉంటుందని టోర్నీని లంకకు షిఫ్ట్ చేశారు.  కానీ  ఆసియా కప్ - 2022 కూడా ఆగస్టు - సెప్టెంబర్‌లోనే జరిగింది.  అప్పుడు కూడా వేడి ఉంది కదా.  2014 ఏప్రిల్‌లో, 2020 సెప్టెంబర్‌లో ఐపీఎల్‌ను  యూఏఈలోనే నిర్వహించారు.   క్రీడల్లోకి రాజకీయ జోక్యం తగదు. ఇది క్షమించరానిది..’ అని  ట్వీట్ చేశాడు. 


 




































ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial