ODI World Cup 2023: దేశం గర్వించదగ్గ నటుడు అమితాబ్ బచ్చన్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బంపరాఫర్ ఇచ్చింది. అక్టోబర్ నుంచి భారత్‌లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌లో ఏ మ్యాచ్‌ను అయినా ఉచితంగా చూడొచ్చు. ఈ మేరకు ప్రత్యేకంగా రూపొందించిన ‘గోల్డెన్ టికెట్’ను బీసీసీఐ కార్యదర్శి జై షా.. బచ్చన్ సాబ్‌కు అందజేశాడు. బీసీసీఐ ఈ విషయాన్ని తన ట్విటర్ ఖాతాలో వెల్లడించింది.
ఈ సందర్భంగా జై షా స్పందిస్తూ.. అమితాబ్ బచ్చన్‌కు టికెట్ అందజేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని, ఆయన వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసేందుకు తప్పుకుండా వస్తారని తాము ఎదురుచూస్తున్నామని పేర్కొన్నాడు. అమితాబ్‌ను ‘సూపర్ స్టార్ ఆఫ్ ది మిలీనియం’గా అభివర్ణించారు. క్రికెట్‌కు వీరాభిమాని అయిన బిగ్ బీ మ్యాచ్‌లు చూసేందుకు రావాలని ఆశిస్తూ బీసీసీఐ కూడా ట్వీట్ చేసింది. అమితాబ్‌కు జై షా గోల్డెన్ టికెట్ అందిస్తున్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.
మరి మా కథేంది..?
అమితాబ్‌కు గోల్డెన్ టికెట్ ఇచ్చి మ్యాచ్‌లు చూసేందుకు ఆహ్వానించడం అభినందనీయమే అయినా అభిమానులు మాత్రం మా కథేంది అంటూ జై షాకు ట్విటర్ లో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అమితాబ్ వంటి సెలబ్రిటీ ద్వారా మ్యాచ్ లను ఎక్కువ మంది వస్తారని బీసీసీఐ, ఐసీసీ భావిస్తున్నా ఫ్యాన్స్ మాత్రం టికెట్ల కోసం ఆన్‌లైన్ అంగట్లో పడిగాపులు కాస్తున్నారు. ఐసీసీ, బీసీసీఐ.. వన్డే ప్రపంచకప్‌లో టికెట్లను బుక్ చేసుకునేందుకు గాను ప్రముఖ యాప్ ‘బుక్ మై షో’తో ఒప్పందం చేసుకుంది. అయితే భారత్ - పాక్, భారత్ -ఆస్ట్రేలియా, భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా వీటి టికెట్లను బుక్ చేసుకునేందుకు క్రికెట్ ఫ్యాన్స్ నానా తంటాలు పడుతున్నారు. సెప్టెంబర్ 3న భారత్ - పాక్ మ్యాచ్ టికెట్ల అమ్మకం ముగిసింది. ఆ తర్వాత సెకండరీ మార్కెట్‌లో ఒక్కో టికెట్ విలువ లక్షల్లో పలుకుతోంది. వయాగొగో అనే యాప్‌లో భారత్ - పాక్ మ్యాచ్ టికెట్ ధర రూ. 56 లక్షలు పలికింది. ఇప్పటికీ కొన్ని సైట్లు.. టికెట్లను రూ. 3 నుంచి రూ. 5 లక్షల వరకూ అమ్ముతూ అభిమానుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. టికెట్ల అమ్మకాల విషయంలో పారదర్శకత లోపించిందని అభిమానులు సామాజిక మాధ్యమాలలో మొత్తుకుంటున్నా పట్టించుకోని బీసీసీఐ.. అన్ని వసతులు ఉన్న సెలబ్రిటీలకు మాత్రం గోల్డెన్ టికెట్లు ఇవ్వడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial