Viral Video: ప్రస్తుత టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్ ఎప్పుడూ సరదాగా ఉంటాడనే విషయం తెలిసిందే. మైదానంలోనూ, బయటా, సోషల్ మీడియాలోనూ ఎలప్పుడు యాక్టివ్ గా ఉంటాడు. సరదా రీల్స్ చేస్తూ నవ్వులు పూయిస్తుంటాడు. అలాంటిదే ఇప్పుడు ఇంకో వీడియోను పంచుకున్నాడు. ఈసారి తన సహచరుడు చాహల్ ను ఆటపట్టించాడు. మరి ఆ వీడియో మీరూ చూసేయండి.
న్యూజిలాండ్ తో మూడో వన్డే కోసం భారత జట్టు క్రైస్ట్ చర్చ్ చేరుకుంది. జట్టు సభ్యులు తమ భార్యలతో విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ చాహల్ రెండు చేతులతో లగేజ్ ను మోసుకొస్తూ కనిపించాడు. మరోవైపు చహాల్ సతీమణి ధనశ్రీ వర్మ ఒక బ్యాగ్ తో వస్తూ కనిపించింది. దీనిపై శిఖర్ ధావన్ సరదాగా స్పందించాడు. ఎక్కవ లగేజ్ మోస్తున్న చాహల్ ను ఆటపట్టిస్తూ, ధనశ్రీని ఉద్దేశించి తన భార్య చాహల్ ను అప్పుడే కూలీని చేసేసింది అని సరదాగా అన్నాడు. దీనిపై వారు కూడా సరదాగానే స్పందించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నవంబర్ 30న భారత్- న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్ చర్చ్ లో నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఈ సిరీస్ లో ప్రస్తుతం కివీస్ జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. మొదటి మ్యాచులో న్యూజిలాండ్ గెలవగా.. రెండోది వర్షం కారణంగా రద్దయింది. కాబట్టి మూడో వన్డే ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ నెగ్గాలని కివీస్... ఇందులో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని టీమిండియా జట్లు పట్టుదలగా ఉన్నాయి.
భారత తుది జట్టు (అంచనా)
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దీపక్ హుడా, అర్హదీప్ సింగ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, యుజువేంద్ర చహాల్, వాషింగ్టన్ సుందర్
న్యూజిలాండ్ తుది జట్టు (అంచనా)
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖెల్ బ్రేస్ వెల్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, టామ్ లాథమ్, గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్సీ, డారిల్ మిచెల్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ.
సంజూకు ఛాన్సిస్తారా!
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో సంజూ శాంసన్‌ను (Sanju Samson) తొలగించడం మరోసారి విమర్శలకు దారితీసింది. బాగా ఆడుతున్నా అతడిని పక్కన పెట్టడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు. బీసీసీఐ, సెలక్షన్ కమిటీ, జట్టు యాజమాన్యంపై విరుచుకుపడుతున్నారు. ఈ ఏడాది వన్డేల్లో ఎక్కువ సిక్సర్లు కొట్టినందుకే అతడిని పక్కన పెట్టారేమోనని ఛలోక్తులు విసురుతున్నారు. పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్న రిషభ్ పంత్ ఎందుకు ముద్దయ్యాడని నేరుగా ప్రశ్నిస్తున్నారు.
మరి ఈ నేపథ్యంలో మూడో వన్డేలో అయినా సంజూకు అవకాశం ఇస్తారో లేదో చూడాలి.