RCB vs MI IPL 2023: ఐపీఎల్‌లో గడిచిన పదిహేనేండ్లుగా ఒకటే కలను  మళ్లీ మళ్లీ కంటున్న  జట్టు ఏదైనా ఉందా..? అంటే అది కచ్చితంగా ఆర్సీబీనే.   ప్రతి సీజన్‌కు ముందు  ఆర్సీబీ అభిమానులు.. ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) అని సోషల్ మీడియాతో పాటు గ్రౌండ్ లో నానా రచ్చ చేస్తారు. అందుకు తగ్గట్టుగానే   ఆర్సీబీ ఆట కూడా  ప్లేఆఫ్స్‌కు చేరేవరకూ  రాజమౌళి  ‘బాహుబలి’ మాదిరిగా ఉంటుంది.  కానీ నాకౌట్ దశకు వెళ్లాక  మాత్రం ‘రాధేశ్యామ్’ కంటే  అధ్వాన్నంగా మారిపోతుంది. ప్రతి సీజన్ మాదిరిగానే  ఐపీఎల్ - 16లో కూడా  ఆర్సీబీ హంగామా కూడా మొదలైంది. కొద్దిరోజుల క్రితమే  డివిలియర్స్, గేల్ తో పాటు కోహ్లీ, డుప్లెసిస్, ఇతర ఆర్సీబీ ఆటగాళ్లతో  చిన్నస్వామి స్టేడియంలో ‘ఆర్సీబీ అన్‌బాక్స్’ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది.  


ఈ క్యాష్ రిచ్ లీగ్ లో మోస్ట్  ఫ్యాన్ బేస్ ఉన్న  ఆర్సీబీ..  నేడు (ఆదివారం) చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో  మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ సారథి ఫాఫ్ డుప్లెసిస్, మాజీ  కెప్టెన్ విరాట్ కోహ్లీలు  ఆర్సీబీ నిర్వహించిన ఓ ఈవెంట్ కు హాజరయ్యారు.  ఈ సందర్భంగా    కోహ్లీ.. డుప్లెసిస్ తో  ‘ఈ సాలా కప్ నమ్దే’అని అనాల్సిందిగా  చెవిలో చెప్పాడు. మైక్ అందుకున్న ఫాఫ్..  పాపం ఈ సాలా కప్ నమ్దే అనబోయి ‘ఈ సాలా కప్ నహీ’ అన్నాడు.    దీంతో అక్కడున్న కోహ్లీతో పాటు హాల్ అంతా ఘొల్లున నవ్వారు. 


 






నిజమే అన్నారా..? 


డుప్లెసిస్ వీడియో  నెట్టింట వైరల్ గా మారిన తర్వాత  ఆర్సీబీ అభిమానులు మాత్రం షాక్ అయ్యారు.   డుప్లెసిస్ తెలియక అన్నాడా..? లేక నిజంగానే ఆర్సీబీ కప్ గెలవదని ఫిక్స్ అయ్యాడా..? అనుకుంటూ  ఆందోళనకు గురవుతున్నారు. డుప్లెసిస్ ఒక్కడే కాదు, రెండ్రోజుల క్రితం ఆర్సీబీ మాజీ ఆటగాడు  క్రిస్ గేల్ కూడా ఈ ఏడాది ప్లేఆఫ్స్ చేరబోయే నాలుగు జట్ల పేర్లు చెప్పమంటే    లక్నో సూపర్ జెయింట్స్,  గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్,  రాజస్తాన్ రాయల్స్ లను ఎంచుకోవడం కూడా ఆర్సీబీ  అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది.   


వీళ్లు కావాలని చెబుతున్నారో లేక ఆర్సీబీకి కప్ కొట్టేంత సీన్ లేదని  అంటున్నారో గానీ  ఈ ప్లేయర్లు చెప్పే మాటలు మాత్రం ఆర్సీబీ ఫ్యాన్స్ కు గుబులు తెప్పించేవే. ఇక ఐపీఎల్ లో ఆర్సీబీ  నేడు ముంబైతో  మ్యాచ్ లో గెలిచి  బోణీ కొట్టాలని ఫిక్స్ అయింది.   కీలక బౌలర్ జోష్  హెజిల్వుడ్ గాయం కారణంగా ఆర్సీబీ తరఫున ఆడబోయే  తొలి ఏడు మ్యాచ్ లకు దూరం కావడం ఆ జట్టుకు  కాస్త నిరాశే అయినా  కివీస్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రాస్‌వెల్  జట్టుతో కలవడం బెంగళూరకు కాస్త ఊరట. కుదురుకుంటే  అలవోకగా సిక్సర్లు బాదే సామర్థ్యమున్న  బ్రాస్‌‌వెల్ ఈ సీజన్ లో ఆర్సీబీ అభిమానుల సుదీర్ఘ కలను నెరవేరుస్తాడో చూడాలి.