Lucknow Super Giants vs Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితం అయింది. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున కైల్ మేయర్స్ (73: 38 బంతుల్లో, రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ చాలా వేగంగా ప్రారంభం అయింది. డేవిడ్ వార్నర్ (56: 48 బంతుల్లో, ఏడు ఫోర్లు) చెలరేగడంతో మొదటి నాలుగు ఓవర్లలోనే 40 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఢిల్లీకి కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ పృథ్వీ షా (12: 9 బంతుల్లో, రెండు ఫోర్లు), వన్‌డౌన్‌లో వచ్చిన మిషెల్ మార్ష్‌లు (0: 1 బంతి) వరుస బంతుల్లో అవుటయ్యారు. టూ డౌన్ బ్యాటర్‌గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ (4: 9 బంతుల్లో, ఒక ఫోర్) కూడా విఫలం కావడంతో ఢిల్లీ ఎనిమిది పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది.


నాలుగో వికెట్‌కు డేవిడ్ వార్నర్, రిలీ రౌసో (30: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) 38 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఈ దశలో రిలీ రౌసో అవుటయ్యాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. రొవ్‌మన్ పావెల్ (1: 3 బంతుల్లో), అమన్ హకీమ్ ఖాన్ (4: 5 బంతుల్లో) విఫలం అయ్యారు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో ఢిల్లీ పోరాటం దాదాపు ముగిసింది. అక్షర్ పటేల్ (16: 11 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) పోరాడినా ఫలితం లేకపోయింది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ చాలా నిదానంగా ఆరంభం అయింది. కెప్టెన్, ఓపెనర్ కేఎల్ రాహుల్ (8: 12 బంతుల్లో, ఒక సిక్సర్) నాలుగో ఓవర్లోనే అవుటయ్యాడు. పవర్ ప్లే ముగిసేసరికి లక్నో వికెట్ నష్టానికి 30 పరుగులు మాత్రమే చేసింది.


ఆ తర్వాత కైల్ మేయర్స్ (73: 38 బంతుల్లో, రెండు ఫోర్లు, ఏడు సిక్సర్లు) చెలరేగి పోయాడు. సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో లక్నో స్కోరు పరుగులు పెట్టింది. అయితే మరో ఎండ్‌లో దీపక్ హుడా (19: 18 బంతుల్లో) క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డాడు. 11వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి దీపక్ హుడా అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో కైల్ మేయర్స్ కూడా అవుటయ్యాడు.


దీంతో స్కోరు వేగం కాస్త నెమ్మదించింది. కానీ నికోలస్ పూరన్ (36: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), చివర్లో ఆయుష్ బదోని (18: 7 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) చెలరేగి ఆడారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 


లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్