PBKS Vs KKR: కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు అదృష్టం కలిసి వచ్చింది. వర్షం ఆటంకం కలిగించిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఏడు పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు సాధించింది. అనంతరం కోల్‌కతా 16 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 146 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు.


డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో కోల్‌కతా ఏడు పరుగులు వెనకబడి ఉండటంతో పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం కారణంగా ఆట ఆగే సమయానికి కోల్‌కతా నాలుగు ఓవర్లలో 46 పరుగులు చేయాల్సి ఉంది. మంచి టచ్‌లో ఉన్న శార్దూల్ ఠాకూర్ (8 నాటౌట్: మూడు బంతుల్లో, ఒక సిక్సర్), సునీల్ నరైన్ (7 నాటౌట్: రెండు బంతుల్లో, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నారు. పంజాబ్ బ్యాటర్లలో భానుక రాజపక్స (50: 32 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా రాణించారు. కోల్‌కతా విజయానికి 120 బంతుల్లో 192 పరుగులు కావాలి.


ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ నితీష్ రాణా బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. వచ్చిన వారందరూ మ్యాచ్‌పై ఇంపాక్ట్ చూపించారు. ఒక్కరు కూడా రెండంకెల కంటే తక్కువ స్కోరు చేయలేదు.


సమిష్టిగా రాణించిన పంజాబ్ బ్యాటర్లు
ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (23: 12 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), శిఖర్ ధావన్ (40: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు) ఇన్నింగ్స్‌ను వేగంగా ప్రారంభించారు. మొదటి రెండు ఓవర్లలో శిఖర్ ధావన్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా ప్రభ్‌సిమ్రన్ చెలరేగి ఆడాడు. రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగాడు. కానీ రెండో ఓవర్ చివరి బంతికి తనని అవుట్ చేసి టిమ్ సౌతీ మొదటి వికెట్ తీశాడు.


వన్‌డౌన్‌లో వచ్చిన భానుక రాజపక్స, శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఇద్దరూ బౌండరీలు, సిక్సర్లతో స్కోరును పరుగులు పెట్టించారు. దీంతో పంజాబ్ 10 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును చేరుకుంది. ఆ తర్వాతి ఓవర్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న భానుక రాజపక్స భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు.


జితేశ్ శర్మ (21: 11 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) రెండు సిక్సర్లతో చెలరేగినా వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత వచ్చిన వారందరూ తమకు చేతనైనంత పరుగులు సాధించారు. అయితే మిడిల్ ఓవర్లలో పరుగుల వేగం నెమ్మదించింది. దీంతో ఒక దశలో రెండు వందల మార్కు దాటుతుందనుకున్న పంజాబ్ 192 పరుగులకే పరిమితం అయింది.


కోల్‌కతా బ్యాటర్ల వైఫల్యం
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా 29 పరుగులకే టాప్ ఆర్డర్ బ్యాటర్ల వికెట్లను కోల్పోయింది. మన్‌దీప్ సింగ్ (2: 4 బంతుల్లో), అనుకుల్ రాయ్ (4: 5 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం కాగా, రహ్మనుల్లా గుర్బాజ్ (22: 16 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ (34: 28 బంతుల్లో), కెప్టెన్ నితీష్ రాణా (24: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, సిక్సర్) ఇన్నింగ్స్ కుదుటపరిచారు. వీరు నాలుగో వికెట్‌కు 46 పరుగులు జోడించారు.


ఈ దశలో నితీష్ రాణాను అవుట్ చేసి సికందర్ రాజా పంజాబ్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన రింకూ సింగ్ (4: 4 బంతుల్లో) విఫలం అయ్యాడు. అనంతరం ఆండ్రీ రసెల్ (35: 19 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఒక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కీలక సమయంలో వరుస ఓవర్లలో ఆండ్రీ రసెల్, వెంకటేష్ అయ్యర్ ఇద్దరూ అవుటయ్యారు. అయినా శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్ చెరో సిక్సర్‌తో మంచి టచ్‌లో కనిపించారు. నాలుగు ఓవర్లలో 46 పరుగులు చేయాల్సిన దశలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది.