Vijay Hazare Trophy 2022:  విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. న్యూఢిల్లీలోని పాలం బీ మైదానంలో మణిపుర్ తో జరిగిన మ్యాచులో ఈ హైదరాబాదీ 77 బంతుల్లో 126 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. 


విజయ్ హజార్ ట్రోఫీలో మణిపుర్ తో జరిగిన మ్యాచులో హైదరాబాద్ విజయం సాధించింది. తిలక్ వర్మ 77 బంతుల్లో 126 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తిలక్ 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 126 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 


ముందుగా బ్యాటింగ్ చేసిన మణిపుర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు మాత్రమే చేసింది.  ఆఖర్లో బికాష్ సింగ్ 44 పరుగులు చేయటంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది.  హైదరాబాద్ బౌలర్ మెహర్ త్రా శశాంక్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్ బ్యాటర్లను మణిపుర్ బౌలర్లు వణికించారు. వారి ధాటికి హైదరాబాద్ 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే తిలక్ వర్మ ధాటిగా ఆడుతూ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. రోహిత్ రాయుడుతో కలిసి నాలుగో వికెట్ కు 164 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని అందించి జట్టును గెలిపించాడు. 2020లో జరిగిన ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాలో రన్నరప్‌గా నిలిచిన భారత అండర్ 19 జట్టులో వర్మ కూడా సభ్యుడు.


ఈ క్రమంలో తిలక్ వర్మ లిస్ట్- ఏ కెరీర్లో  కేవలం 23 మ్యాచుల్లోనే తన ఐదో సెంచరీని అందుకున్నాడు. 53 సగటుతో 1116 పరుగులు చేశాడు. తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ కు ముంబై ఇండియన్స్ ఈ ఆటగాడిని రీటెయిన్ చేసుకుంది. గతేడాది ఐపీఎల్ లో తిలక్ వర్మ 14 మ్యాచ్‌లలో 36.09 సగటుతో రెండు అర్ధ సెంచరీలు 397 పరుగులు చేశాడు.