Ajit Agarkar as Chief Selector: మునుపెన్నడూ చూడని విధంగా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీపై బీసీసీఐ వేటు వేసింది. మాజీ క్రికెటర్‌ చేతన్‌ శర్మ నేతృత్వంలోని కమిటీని రద్దు చేసింది. కొత్త వారి కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా కొత్త చీఫ్ సెలక్టర్‌గా ఎవరు ఎంపికవుతారోనన్న ఆసక్తి నెలకొంది. వెస్ట్‌జోన్‌ నుంచి అజిత్‌ అగార్కర్‌ ఈ బాధ్యతలు చేపట్టొచ్చని తెలుస్తోంది. ఆయన పట్ల బోర్డు సైతం సుముఖంగానే ఉన్నట్టు సమాచారం.


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాజయంతో సంస్కరణలు చేపట్టేందుకు బీసీసీఐ సిద్ధమైంది. కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మొదట సెలక్షన్‌ కమిటీపై వేటు వేసింది. ఛేతన్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసిన విధానం బాగాలేదని బోర్డు భావించింది. వికెట్లు తీసే యుజ్వేంద్ర చాహల్‌కు ఒక్క మ్యాచులోనైనా అవకాశం ఇవ్వకపోవడం, క్రికెటర్లకు సరైన విశ్రాంతి ఇవ్వకపోవడంపై విమర్శలు పెరిగిన సంగతి తెలిసిందే.


బీసీసీఐ సెలక్టర్‌ పదవికి అజిత్‌ అగార్కర్‌ మరోసారి దరఖాస్తు చేస్తారని సమాచారం. ప్రస్తుతం అతడు దిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. ఒకవేళ సెలక్షన్‌ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలంటే కోచ్‌ పదవిని వదిలేయాల్సి ఉంటుంది. అగార్కర్‌ వెస్ట్‌జోన్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తాడు. టీ20 ప్రపంచకప్‌ 2021 ముగిసిన వెంటనే అభయ్ కురువిల్లా పదవీ కాలం ముగిసింది. అప్పట్నుంచి వెస్ట్‌జోన్‌ స్థానం ఖాళీగానే ఉంది. గతంలో ముంబయి చీఫ్‌ సెలక్టర్‌గా పనిచేసిన అనుభవం అజిత్‌కు ఉంది.


'అజిత్‌ అగార్కర్‌తో మేమింకా మాట్లాడలేదు. ఐపీఎల్‌ పదవి వదిలేసి సెలక్టర్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం అతడిష్టం. గతంలో అతడు దాదాపుగా పదవిని సమీపించాడు. కమిటీలో అతనుండటం మాకు సంతోషమే. ఐపీఎల్‌ను పక్కన పెడితే మూడు ఫార్మాట్లలో అనుభవం ఉన్న చిన్న వయస్కుడు. అతడి సూచనలు, అనుభవం వెలకట్టలేనివి. అతడు కుర్రాళ్లతో కలిసి పనిచేశాడు. వారిని అర్థం చేసుకుంటాడు. పైగా దేశవాళీ క్రికెట్‌ వ్యవస్థ గురించి తెలుసు' అని బీసీసీఐ అధికారి ఒకరు అన్నారు.


1990ల్లో అజిత్‌ అగార్కర్‌ పేసర్‌గా రాణించాడు. టీమ్‌ఇండియా తరఫున 26 టెస్టుల్లో 58 వికెట్లు పడగొట్టాడు. 191 వన్డేల్లో 288 వికెట్లు తీశాడు. 4 టీ20ల్లో 3 వికెట్లు అందించాడు. 110 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచుల్లో 288, 270 లిస్ట్‌ ఏ మ్యాచుల్లో 420, 62 టీ20 మ్యాచుల్లో 47 వికెట్లు పడగొట్టాడు. అవసరమైనప్పుడు బ్యాటుతో పరుగులూ చేశాడు. ఆట నుంచి రిటైర్‌ అయ్యాక ముంబయి క్రికెట్‌ సంఘంలో కీలకంగా మారాడు. సెలక్టర్‌గా పనిచేశాడు. కామెంటేటర్‌గా ఆకట్టుకుంటున్నాడు.