BCCI: T20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ - బీసీసీఐ కీలక నిర్ణయం, సెలక్షన్ కమిటీపై వేటు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ చేతన్ శర్మ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్ కమిటీ (సీనియర్ పురుషులు)పై వేటు వేసింది. సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు ఈ సెలక్షన్ కమిటీ ఇప్పటివరకూ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆటగాళ్ల ఎంపికపై సైతం విమర్శలు వెల్లువెత్తాయి. సెమీస్ లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలై ఇంటిదారి పట్టడం తెలిసిందే. ఈక్రమంలో బీసీసీఐ బోర్డు సీనియర్ టీమ్ జాతీయ సెలక్షన్ కమిటీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. పీటీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. సీనియర్ సెలక్షన్ కమిటీ పోస్టులకు దరఖాస్తులను సైతం ఆహ్వానించింది బీసీసీఐ.






సీనియర్ సెలక్షన్ కమిటీ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.
బీసీసీఐ ప్రకటన..
నేషనల్ సెలక్టర్స్ (సీనియర్ పురుషుల జట్టు) కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు కింది అర్హతలు కలిగి ఉండాలి’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 
నేషనల్ సెలక్టర్స్ (సీనియర్ మెన్)
పోస్టులు - 5
పోస్టులకు కావాల్సిన అర్హతలు..
7 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా
30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం కలిగి ఉండాలి లేదా
10 వన్డేల తో పాటు 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాలి
కనీసం 5 ఏళ్ల కిందట క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వారు అర్హులు అవుతారు. 
నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా అభ్యర్థులు నేషనల్ సెలక్టర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ తమ ప్రకటనలో స్పష్టం చేసింది. 






ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఫామ్ లో లేని ఆటగాళ్లను నేషనల్ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసి ఆస్ట్రేలియాకు పంపించింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో రోహిత్ సేన దారుణంగా ఓడిపోయింది. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించి ఫైనల్ చేరింది. ఆటగాళ్ల ఎంపికపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా సీనియర్ సెలక్షన్ కమిటీ మొత్తాన్ని బీసీసీఐ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆపై ఫైనల్లో మాజీ ఛాంపియన్ పాకిస్తాన్ పై విజయం సాధించి రెండోసారి పొట్టి ప్రపంచ కప్ ను ముద్దాడింది ఇంగ్లాండ్ టీమ్.


టీ20 వరల్డ్ కప్ లో భారత్ సెమీఫైనల్లో ఓడినప్పటికీ అంతకుముందు నెగ్గిన మ్యాచ్ లు సైతం సాధారణ విజయాలుగా చెప్పవచ్చు. జింబాబ్వే, నెదర్లాండ్ జట్లపై ఘన విజయం సాధించగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్  లపై మ్యాచ్ చివరి వరకు వెళ్లి గెలవాల్సి వచ్చింది. వికెట్ కీపర్ పంత్ ను సరిగ్గా వినియోగించుకోలేకపోవడం, మణికట్టు స్పిన్నర్ చాహల్ ను పొట్టి ప్రపంచ కప్ లో ఒక్క మ్యాచ్ లోనూ ఆడించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.