T20 World Cup 2024, IND vs USA Highlights: టీ 20 ప్రపంచకప్‌( T20 World Cup 2024  )లో టీమిండియా(Team India) సూపర్‌ 8లోకి దూసుకెళ్లింది. ఆతిథ్య అమెరికా(USA) తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి రోహిత్ సేన సూపర్‌ ఎయిట్‌(Super-8)లో ప్రవేశించింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న నసావు క్రికెట్‌ స్టేడియంలోని పిచ్‌పై అమెరికా మరో పోరాటంతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా 110 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఆరంభంలోనే మూడు వికెట్లు తీసి భారత్‌కు కూడా షాక్‌ ఇచ్చేలా కనిపించింది. కానీ తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఆచితూతి ఆడిన టీ 20 నెంబర్‌ వన్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌, శివమ్‌ దూబే భారత్‌కు మరో పది బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు. ఈ గెలుపుతో టీ 20 ప్రపంచకప్‌లో భారత్‌... సూపర్ ఎయిట్‌లోకి దూసుకెళ్లగా.... గ్రూప్‌ ఏలో పోరు రసవత్తరంగా మారింది. ఇక మిగిలి ఉన్న ఒక్క బెర్తు కోసం అమెరికా- పాకిస్థాన్‌ పోటీ పడుతున్నాయి.

 

కుప్పకూలిన అమెరికా

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ(Rohit Sharma) మరో ఆలోచన లేకుండా బౌలింగ్ ఎంచుకున్నాడు. హిట్‌మ్యాన్‌ ఆహ్వానంతో బ్యాటింగ్‌కు వచ్చిన అమెరికాకు.. అర్ష్‌దీప్‌ సింగ్‌(Arshadeep Singh) చుక్కలు చూపించాడు. అసలే పిచ్‌ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా అర్ష్‌దీప్‌ సింగ్‌ పదునైన బంతులతో... అమెరికా బౌలర్లకు పరీక్ష పెట్టాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ తీసి ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టాడు. అర్ష్‌దీప్‌ వేసిన బంతి... నేరుగా అమెరికా ఓపెనర్‌ జహంగీర్‌ ప్యాడ్లను తాకింది. టీమిండియా అప్పీల్ చేయడం.. అంపైర్‌ వేలు పైకెత్తడం చకచకా జరిగిపోయాయి. దీంతో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకుండానే అమెరికా తొలి వికెట్‌ కోల్పోయింది.

ఆ తర్వాత కాసేపటికే అర్ష్‌దీప్‌ అమెరికాను మరో దెబ్బ కొట్టాడు. ఆండ్రియో గౌస్‌ను అవుట్‌ చేసి అర్ష్‌దీప్‌... అమెరికాను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కేవలం రెండే పరుగులు చేసి గౌస్‌ అవుటయ్యాడు. దీంతో అమెరికా మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌... అమెరికా బ్యాటర్లకు అగ్నిపరీక్ష పెట్టాడు. 30 బంతుల్లో 24 పరుగులు చేసిన స్టీఫెన్‌ టేలర్‌ను అక్షర్‌ పటేల్‌ బౌల్డ్‌ చేసి భారత్‌కు మరో వికెట్‌ను అందించాడు. కాసేపటికే అరోన్‌ జోన్స్‌ను హార్దిక్‌ పాండ్యా అవుట్‌ చేయడంతో అమెరికా కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి.  కానీ నితీశ్‌ కుమార్‌ 27, కోరీ అండర్సన్‌ 15, హర్మీత్‌ సింగ్‌ 10 పరుగులు చేయడంతో అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో  ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.  భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను నేలకూల్చాడు. హార్దిక్‌ పాండ్యా రెండు, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశారు.

 

దిమ్మతిరిగే షాక్‌లు

111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ను ఆరంభంలో అమెరికా బౌలర్లు వణికించారు. ముఖ్యంగా నేత్రవాల్కర్‌ భారత బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. తొలి ఓవర్‌లోనే కింగ్‌ కోహ్లీని అవుట్‌ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. దీంతో ఆరు పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. తర్వాత కాసేపటికే కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అవుట్‌ చేసి భారత్‌ను నేత్రవాల్కర్‌ కష్టాల్లోకి నెట్టాడు. మూడు పరుగులే చేసి రోహిత్‌ అవుట్‌ కావడంతో భారత్‌ 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పంత్‌- సూర్య కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కానీ పంత్‌ 18 పరుగులు చేసి అవుట్‌ అవ్వడంతో 44 పరుగుల వద్ద భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో సూర్యకుమార్‌ యాదవ్‌(Surya kumar Yadav), శివమ్ దూబే కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు విజయాన్ని అందించారు. తమ సహజ శైలికి విరుద్ధంగా వీరిద్దరూ చాలా ఓపిగ్గా బ్యాటింగ్‌ చేశారు. సింగిల్స్‌ రొటేట్‌ చేస్తూ పరుగులు జోడించారు. వీరిద్దరి సమయోచిత బ్యాటింగ్‌తో భారత్‌ విజయం దిశగా నడిచింది. మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడిన వీరిద్దరూ భారత్‌కు విజయాన్ని అందించి అజేయంగా నిలిచారు.

సూర్యకుమార్‌ యాదవ్‌ 49 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేయగా... శివమ్ దూబే 35 బంతుల్లో 31 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీరిద్దరి పోరాటంతో భారత్‌ మరో వికెట్‌ కోల్పోకుండా పది బంతులు మిగిలి ఉండగానే మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.