Suryakumar Yadav world No. 1 in ICC Men's T20I batting rankings:  ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌(ICC Men's T20I batting rankings)లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(Suryakumar Yadav) అగ్రస్థానాన్ని నిలుపుకుని సత్తా చాటాడు. 837 పాయింట్లతో సూర్య టాప్‌ లేపాడు. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఫిల్‌ సాల్ట్  800 పాయింట్లతో రెండో స్థానాన్ని నిలుపుకున్నాడు.  పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ మూడో స్థానానికి ఎగబాకగా... మరో పాక్ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆజమ్‌ 756 పాయింట్లతో మూడో స్థానంలో... రిజ్వాన్‌ 752 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.  ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ ఐదో స్థానానికి చేరుకోగా, మరో భారత ఆటగాడు యశస్వీ జైస్వాల్‌ 700 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆరు స్థానాలు ఎగబాకి టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. ఆఫ్ఘానిస్థాన్ ఓపెనింగ్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ 12వ స్థానానికి చేరుకుని తన కెరీర్‌లోనే తొలిసారి అత్యుత్తమ ర్యాంక్‌ సాధించాడు. 




 

నబీ అగ్రస్థానం 

ఆల్‌రౌండర్‌ల జాబితాలో అఫ్గాన్‌ ఆల్‌రౌండర్ నబీ (Mohammad Nabi )నంబర్ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్‌ అజేయంగా నిలవడంలో నబీ కీలక పాత్ర పోషించాడు. నబీ అద్భుత ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేయడంతో న్యూజిలాండ్‌ను అఫ్గాన్‌ చిత్తు చేసింది. 39 ఏళ్ల నబీ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మార్కస్ స్టోయినిస్ రెండో స్థానానికి ఎగబాకాడు. శ్రీలంక ఆటగాడు వసిందు హసరంగ మూడు, జింబాబ్వేకు చెందిన సికిందర్ రజా నాలుగో ర్యాంకులో ఉన్నారు. షకీబుల్‌ హసన్ అయిదో స్థానానికి పడిపోయాడు. 

 

బౌలర్లలో రషీద్‌

టీ 20 బౌలర్ల జాబితాలో ఇంగ్లండ్‌ ఆటగాడు ఆదిల్‌ రషీద్‌(Adil Rashid) అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక కెప్టెన్‌ వనిందు హసరంగ రెండో స్థానంలో నిలిచాడు. అఫ్గాన్‌ బౌలర్లు రషీద్‌ ఖాన్‌, ఫజల్‌హక్‌ ఫరూఖీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. రషీద్‌ ఖాన్ నాలుగు స్థానాలు ఎగబాకి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. టీమిండియా బౌలర్‌ అక్షర్‌ పటేల్‌ ఏడో స్థానంలో ఉండగా... మరో బౌలర్‌ రవి భిష్ణోయ్‌ పదో స్థానంలో ఉన్నాడు. ఇద్దరు టీమిండియా బౌలర్లకు టాప్‌ టెన్‌లో చోటు దక్కింది. 

 

టీమిండియాదే టాప్‌

టీ 20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 12, 975 పాయింట్లతో భారత జట్టు అగ్రస్థానంలో ఉండగా... 9,043 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.  ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌  ఉన్నాయి. వరుస పరాజయాలతో.. సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ పాయింట్ల పట్టికలో దిగజారి ఏడో స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రికా ఆరో స్థానంలో ఉండగా... న్యూజిలాండ్‌ అయిదో స్థానంలో ఉంది. ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్‌ జరుగుతున్న వేళ ఈ ర్యాంకింగ్స్‌లో మార్పులు సంభవించే అవకాశం ఉంది.