Arshdeep four for restricts USA to 110:  టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) లో భారత్‌(India)తో జరుగుతున్న మ్యాచ్‌లో అమెరికా(USA) బ్యాటర్లు రాణించారు. నసావు స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియాకు సవాల్‌ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. నసావులోని పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తున్న వేళ ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా ఛేదిస్తుందా... లేక మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను నేలకూల్చాడు.


 

ఆరంభంలోనే షాక్‌

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా... అమెరికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అమెరికాను తొలి ఓవర్‌లో.. తొలి బంతికే అర్ష్‌దీప్‌సింగ్‌( Arshdeep) చావు దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్‌ తొలి బంతికే అమెరికా ఓపెనర్‌ జహంగీర్‌ను అర్ష్‌దీప్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో స్కోరు బోర్డుపై ఒక్క పరుగు లేకుండానే అమెరికా తొలి వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే అమెరికా మరో వికెట్‌ కోల్పోయింది.  ఆండ్రియో గౌస్‌ను అవుట్‌ చేసి అర్ష్‌దీప్‌... అమెరికాకు మరో షాక్‌ ఇచ్చాడు. గౌస్‌ రెండు పరుగులే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో అమెరికా మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కాసేపు వికెట్ల పతనం ఆగినా బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌... అమెరికా బ్యాటర్లకు అగ్నిపరీక్ష పెట్టాడు. స్టీఫెన్‌ టైలర్‌, ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న అరోన్‌ జోన్స్‌... కాసేపు భారత బౌలర్లను ఎదుర్కొన్నారు. 30 బంతుల్లో 24 పరుగులు చేసిన స్టీఫెన్‌ టేలర్‌ను అక్షర్‌ పటేల్‌ బౌల్డ్‌ చేసి భారత్‌కు మరో వికెట్‌ను అందించాడు. కాసేపటికే అరోన్‌ జోన్స్‌ను హార్దిక్‌ పాండ్యా అవుట్‌ చేయడంతో అమెరికా కష్టాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. 

 

కీలక భాగస్వామ్యం

 56 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయినా అమెరికా వంద పరుగులైనా దాటుతుందా అనిపించింది. కానీ నితీశ్‌ కుమార్‌ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 27 పరుగులు చేసి అమెరికాను మంచి లక్ష్యం దిశగా నడిపించాడు. ప్రమాదకరంగా మారుతున్న నితీశ్‌ను అవుట్‌ చేసి అర్ష్‌దీప్‌ మరోసారి అమెరికాకు షాక్‌ ఇచ్చాడు. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి నితీశ్‌కుమార్‌ అవుటయ్యాడు. కోరీ అండర్సన్‌ 12 బంతుల్లో 15 పరుగులు, హర్మీత్‌ సింగ్‌ 10 బంతుల్లో 10 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు. చివర్లో షాడ్లీ పర్వాలేదనిపించడంతో అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో  ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.  భారత బౌలర్లలో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లను నేలకూల్చాడు. హార్దిక్‌ పాండ్యా నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక మెయిడిన్‌ వేసి కేవలం 14 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశాడు.